Share News

High Court: బడుల్లో కలుషిత భోజనంపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:49 AM

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనలపై నివేదిక అందజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

High Court: బడుల్లో కలుషిత భోజనంపై నివేదిక ఇవ్వండి

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనలపై నివేదిక అందజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఆ పథకం అమలును పర్యవేక్షించే టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు, కమిటీ సభ్యుల వివరాలు సైతం నివేదికలో పొందుపర్చాలని తెలిపింది. ప్రమాణాల ప్రకారం మధ్యాహ్న భోజనం అందజేయడం లేదని, నారాయణపేట్‌ జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వారంలో మూడుసార్లు కలుషిత ఆహారం పెట్టారని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలయింది.


దీనిపై గురువారం చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ పీఎం పోషణ్‌ పథకంలో భాగంగా పనిచేయాల్సిన పర్యవేక్షణ కమిటీలు సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రభు త్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ వాదిస్తూ.. ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై మాగనూర్‌ పాఠశాల హెచ్‌ఎంను సస్పెండ్‌ చేయడంతోపాటు కాంట్రాక్టర్‌ను తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Dec 06 , 2024 | 03:49 AM