High Court: మన విద్యార్థి స్థానికుడు కాదా..?
ABN , Publish Date - Sep 27 , 2024 | 04:03 AM
ఓ విద్యార్థిని డెహ్రాడూన్‌లోని సైనిక పాఠశాలకు రాష్ట్ర కోటాలో ఎంపిక చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం అతడు స్థానికుడు కాదంటూ.. స్థానిక కోటా కింద ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు అనుమతించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
విద్య కోసం డెహ్రాడూన్ పంపింది సర్కారే కదా
ఇప్పుడు కౌన్సెలింగ్‌లో నాన్‌లోకల్ అంటే ఎలా..?
కాళోజీ హెల్త్ వర్సిటీని తప్పు పట్టిన హైకోర్టు
ఓ విద్యార్థిని డెహ్రాడూన్‌లోని సైనిక పాఠశాలకు రాష్ట్ర కోటాలో ఎంపిక చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం అతడు స్థానికుడు కాదంటూ.. స్థానిక కోటా కింద ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు అనుమతించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. స్థానికత విషయంలో విచక్షణ ప్రదర్శించకుండా కఠినంగా వ్యవహరిస్తున్న కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తీరును తప్పుబట్టింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని దుర్గాసాయినగర్‌కు చెందిన చేపూరి అవినాశ్‌ను రాష్ట్ర కోటా కింద డెహ్రాడూన్ సైనిక పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ విద్యార్థి 8 నుంచి 10 తరగతుల వరకు డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ స్కూల్‌లో చదివాడు.
తర్వాత తెలంగాణకు వచ్చి ఇంటర్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ మెడికల్ కౌన్సిలింగ్‌కు సంబంధించిన స్థానికత జీవో 33 ప్రకారం రెండేళ్లు బయటి రాష్ట్రంలో చదివినందున అవినాశ్ స్థానిక కోటాకు అనర్హుడని అధికారులు తేల్చారు. వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవలేదు కాబట్టి 85 శాతం స్థానిక కోటా వర్తించదని చెప్పారు. దీంతో అవినాశ్ హైకోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లు బయట చదివిన విద్యార్థిని లోకల్ అభ్యర్థిగా గుర్తించలేమని యూనివర్సిటీ తరఫు న్యాయవాది చెప్పడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ ఈ విషయంపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. వివరాలు తెలియజేయాలని ఆదేశించింది.