Share News

High Court: కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం..

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:54 AM

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి లేఖ అధికారులను కదిలించింది. కొన్నాళ్లుగా సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చివరికి రాష్ట్ర హైకోర్టు(High Court) న్యాయమూర్తికి, గవర్నర్‌కు లేఖ రాస్తూ విన్నవించారు.

High Court: కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం..

- పాఠశాలను కాపాడాలని హైకోర్టుకు ప్రధానోపాధ్యాయుడి లేఖ

- సుమోటోగా కేసు నమోదు

- నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం

హైదరాబాద్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి లేఖ అధికారులను కదిలించింది. కొన్నాళ్లుగా సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చివరికి రాష్ట్ర హైకోర్టు(High Court) న్యాయమూర్తికి, గవర్నర్‌కు లేఖ రాస్తూ విన్నవించారు. స్పందించిన న్యాయమూర్తి లేఖను సుమోటోగా స్వీకరించి కౌంటర్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించించారు. వివరాలిలా ఉన్నాయి.

తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ(Turkyanjal Municipality) కమ్మగూడలోని వీరమణి బిస్కెట్‌ కంపెనీ యాజమాన్యం పేద విద్యార్థుల చదువు కోసమని 1998లో 20 గుంటల భూమిని స్థానిక ప్రభుత్వ పాఠశాల(విద్యాశాఖ)కు బహుమతిగా ఇచ్చారు. అప్పటి అధికారులు, పాలకులు ఆ భూమిలో కొంతభాగంలో ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. నిధుల కొరతతో ప్రహరీని ఏర్పాటు చేయలేకపోయారు. ఈ భూమి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.12కోట్లకు చేరింది.

ఇదికూడా చదవండి: Hyderabad: అంబర్‌పేటలో ఇద్దరు అదృశ్యం..


city5.2.jpg

పాఠశాలకు స్థలం ఇచ్చి సుమారు 26 సంవత్సరాలు కావస్తుండడంతో చుట్టూ అనేక కాలనీలు వెలిశాయి. సమీప కాలనీలకు రోడ్డు లేదనే పేరుతో పాఠశాల స్థలం మధ్యనుంచి రోడ్డును వేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.దాసు, విద్యాకమిటీ చైర్మన్‌ లక్ష్మయ్య గగ్గోలు పెట్టి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సదరు ప్రధానోపాధ్యాయుడు గత జూన్‌ 25న తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్ర గవర్నర్‌కు ఉత్తరం రాశారు. దీంతో హైకోర్టు ఉపాధ్యాయుని ఉత్తారాన్ని సుమోటోగా తీసుకుని నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్‌, రెవెన్యూ, సర్వే, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


కదిలిన యంత్రాంగం

ఇప్పటి వరకు పట్టించుకోని అధికారులు కోర్టు ఆదేశంతో శనివారం కమ్మగూడ పాఠశాలను సందర్శించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, అబ్దుల్లాపూర్‌మెట్‌(Abdullahpurmet) మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, సర్వేయర్‌ కావ్య, ఆర్‌ఐ నిజాంతో పాటు మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు శనివారం పాఠశాలను సందర్శించారు. ఎక్సకవేటర్‌తో రోడ్డుకు అడ్డంగా కందకాన్ని తవ్వారు. పాఠశాలకు ఉండాల్సిన స్థలాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.


ఇదికూడా చదవండి: Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 28 , 2024 | 11:54 AM