High Court: మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చండి
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:20 AM
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరునాగారం ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నేటి వరకు ఏటూరునాగారంలోనే ఉంచండి
ఫోరెన్సిక్ నిపుణులతోనే పోస్టుమార్టం చేయించారా
శవ పరీక్షలో పాల్గొన్న వారి వివరాలివ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు ఏటూరునాగారం ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ కాల్వల ఐలమ్మకు అనుమతి ఇవ్వాలని చెప్పింది. అలాగే పోస్టుమార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పోలీసులు తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూడనివ్వడం లేదని కాల్వల ఐలమ్మ అనే మహిళ సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది డి.సురేశ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని ములుగు ఎస్పీకి ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారని.. అలాగే పోస్ట్‌మార్టం చేసేటప్పుడు బంధువులెవరినైనా అనుమతించాలని కోరినట్లు తెలిపారు.
పిటిషన్‌ను అనుమతించకపోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు పోలీసులు హడావుడిగా, ఫోరెన్సిక్ నిపుణులు లేకుండానే పోస్టుమార్టం చేయించారని ఆరోపించారు. పోలీసులు.. మావోయిస్టుల ఆహారంలో విషం, మత్తు పదార్థాలు కలిపారని.. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక చిత్రహింసలకు గురిచేసి కాల్చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టుమార్టం జరిపించాలని కోరారు. అదేవిధంగా పిటిషనర్ తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని కోరారు. అది నిజమైన ఎన్‌కౌంటర్ అయితే మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఎందుకు తరలించలేదని.. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఎందుకు పోస్టుమార్టం చేయించలేదని ప్రశ్నించారు. మరోవైపు పోలీసులు, ప్రభుత్వం తరఫున హోంశాఖ న్యాయవాది మహేశ్‌రాజే వాదనలు వినిపించారు. ఆదివారం మృతదేహాలకు ఏటూరునాగారంలో పోస్టుమార్టం నిర్వహించామని.. డాక్టర్ల బృందంలో ఫోరెన్సిక్ నిపుణులున్నారని పేర్కొన్నారు. పిటిషనర్‌ను సైతం మృతదేహాలను చూసేందుకు అనుమతించామని చెప్పారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున మృతదేహాలను వరంగల్ తరలించలేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పోస్టుమార్టం చేసిన డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలతోపాటు పోలీసుల వైఖరిని లిఖితపూర్వకంగా చెప్పాలని పేర్కొంది. ఈ మేరకు విచారణ మంగళవారానికి వాయిదాపడింది.
మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
ఏటూరునాగారం రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం జరిగింది. ఏటూరునాగారం మండలం చల్పాక- ఐలాపురం అడవుల్లోని పొలాకమ్మ వాగు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారు మృతదేహాలను ఆదివారం రాత్రి ట్రాక్టర్ ద్వారా ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెనిక్స్ బృందం ఆధ్వర్యంలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆ బృందంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు పీజీ డాక్టర్లు ఉన్నారు. ఏడుగురి మృతదేహాల పోస్టుమార్టానికి సుమారు 8 గంటలు పట్టింది. అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. కాగా, చల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ముమ్మాటికీ బూటకమేనని మృతుల బంధువులు ఆరోపించారు. తమ వారిని విషమిచ్చి, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని తెలిపారు. మృతదేహాలను చూసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, కర్కషంగా వ్యవహరించారని మండిపడ్డారు.