High Court: ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇళ్లు ఖాళీ చేయించండి
ABN , Publish Date - Aug 27 , 2024 | 03:26 AM
ఇళ్లు లేని పేదలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్ పట్టాలను రద్దు చేయకుండా తిరిగి ఆ భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని వరంగల్ కార్పొరేషన్ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది.
తొలుత ఎఫ్‌టీఎల్ పరిఽధిలో ఉన్నాయో, లేవో తేల్చండి
అసైన్డ్ పట్టాలు రద్దు చేయకుండా భూ స్వాధీనం తగదు
వరంగల్ కార్పొరేషన్ అధికార్లకు హైకోర్టు ఆదేశం
చిన్నవడ్డేపల్లి చెరువు పరిసరాల పేదలకు ఊరట
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఇళ్లు లేని పేదలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్ పట్టాలను రద్దు చేయకుండా తిరిగి ఆ భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని వరంగల్ కార్పొరేషన్ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. తొలుత చిన్న వడ్డేపల్లి చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్‌జోన్ హద్దులు గుర్తించాలని, అనంతరమే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్) కుటుంబాలకు కేటాయించిన 60-100 గజాల స్థలాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయా? లేవా? అని తొలుత నిర్ధారించాలని తెలిపింది. ఒకవేళ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని తేలితే మాత్రమే చట్టప్రకారం నోటీసులు, తగిన సమయం ఇచ్చి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అసైన్‌మెంట్ పట్టాలు రద్దు చేసి ప్రత్నామ్నాయం చూపిన తర్వాతే భూస్వాధీన ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియ ముగిసే వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్నవడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాల్లోని దేశాయిపేట ఎంహెచ్ నగర్ బీపీఎల్ కుటుంబాలను ఖాళీ చేయించరాదని ఆదేశించింది.
చిన్న వడ్డేపల్లి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో తాము లేమని, అయినప్పటికీ రెవెన్యూ, మున్సిపల్‌ఽ, నీటిపారుదలశాఖల అధికారులు తమ ఇళ్లు కూల్చేస్తున్నారని పేర్కొంటూ రేమకొంట్ల కొమురమ్మ మరో 126 బీపీఎల్ కుటుంబాలవారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫున న్యాయవాది శామల రవీందర్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌లకు ప్రభుత్వం భూములు కేటాయించిన సర్వే నెంబర్, చెరువు సర్వే నంబర్ వేరని.. అయినప్పటికీ ఎఫ్‌టీఎల్‌లో ఉన్నారని అధికారులు కూల్చేస్తున్నారని పేర్కొన్నారు.
చెరువుకు మరోవైపు ఉన్న ఎఫ్‌టీఎల్‌లో ప్రైవేటు వ్యక్తులు చేసిన కబ్జాలను తొలగించడం లేదని, దశాబ్దాలుగా అసైన్‌మెంట్ పట్టా భూముల్లో ఉన్న పేదల గుడిసెలను ఖాళీచేయిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అసైన్‌మెంట్ పట్టాలు, కరెంట్ బిల్లులు, ఆస్తిపన్ను తదితర ఆధారాలు పిటిషనర్‌ల వద్ద ఉన్నాయని తెలిపింది. పట్టాలు రద్దు చేయకుండా భూములు ఎలా ఖాళీచేయిస్తారని ప్రశ్నించింది. అన్ని నిబంధనలు పాటించాలని, మొత్తం ప్రక్రియ ముగిసే వరకు తొలగింపు చర్యలు చేపట్ట రాదని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్‌ను ముగించింది.