‘ఓటుకు నోటు’.. ఈడీ కేసు కొట్టేయడానికి నిరాకరణ
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:18 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం కృష్ణకీర్తన్‌కు హైకోర్టులో ఊరట లభించలేదు. ఓటుకు నోటు వ్యవహారంలో ఈడీ కేసు కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
వేం నరేందర్‌రెడ్డి కుమారుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కుమారుడు వేం కృష్ణకీర్తన్‌కు హైకోర్టులో ఊరట లభించలేదు. ఓటుకు నోటు వ్యవహారంలో ఈడీ కేసు కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఓటుకు నోటు వ్యవహారంలో తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టేయడంతోపాటు ఈడీ ప్రత్యేక కోర్టు 2021లో జారీచేసిన సమన్లను నిలిపివేయాలంటూ కృష్ణకీర్తన్ హైకోర్టులో 2022లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేవలం కుట్ర ఆరోపణల ఆధారంగా ఈడీ కేసు పెట్టడం సరికాదన్నారు. ఇలాంటి అంశంపై ‘పవన్ దిబ్బూర్ వర్సెస్ ఈడీ’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.
ఏసీబీ కేసులో పిటిషనర్ నిందితుడు కాదనే విషయాన్ని పట్టించుకోకుండా ఈడీ కేసులో నిందితుడిగా చేర్చడం అక్రమమన్నారు. ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నేరుగా ప్రధాన నిందితుడైన ఎ.రేవంత్‌రెడ్డి (ప్రస్తుత సీఎం)కి, ఏ-3గా ఉన్న ఉదయ్ సింహకు సహాయం చేశారని తెలిపారు. రూ.50 లక్షల నగదును పిటిషనర్ (వేం కృష్ణకీర్తన్) సమకూర్చినట్లు ఉదయ్ సింహ తెలిపారన్నారు. ప్రధాన కేసు పరిణామక్రమంలో మనీలాండరింగ్ జరిగిందని.. అందుకే పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చామని చెప్పారు. కుట్రలో పిటిషనర్ భాగస్వామి అని.. సదరు డబ్బు లంచంగా ఇస్తున్నట్లు ఆయనకు తెలుసని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.