Share News

Hyd : కంటి గుండా మెదడుకు సర్జరీ

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:58 AM

సాధారణంగా మెదడులో కణితిని తొలగించాలంటే.. పుర్రె భాగానికి కోత పెట్టాలి! కానీ.. మెదడులో కణితితో బాధపడుతున్న 54 ఏళ్ల మహిళకు ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కలిగించారు!

Hyd : కంటి గుండా మెదడుకు సర్జరీ

  • ‘ఎండోస్కోపిక్‌ లాటరల్‌ ట్రాన్స్‌ ఆర్బిటల్‌’

  • విధానంలో మెదడులో కణితి తొలగింపు

  • ఏఐజీ న్యూరో సర్జరీ వైద్యుల ఘనత

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా మెదడులో కణితిని తొలగించాలంటే.. పుర్రె భాగానికి కోత పెట్టాలి! కానీ.. మెదడులో కణితితో బాధపడుతున్న 54 ఏళ్ల మహిళకు ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కలిగించారు! ఆమె కనుబొమ కింద భాగంలో గాటు పెట్టి.. ఆ మార్గం గుండా శస్త్రచికిత్స చేసి మెదడులో కణితిని తొలగించారు.

రోగి పుర్రెను తెరవకుండా నిర్వహించే ఈ ప్రక్రియను ‘ఎండోస్కోపిక్‌ లాటరల్‌ ట్రాన్స్‌ ఆర్బిటల్‌ అప్రోచ్‌’ అంటారు. ఈ తరహా సర్జరీ నిర్వహించడం భారతదేశంలోనే మొదటిసారి వైద్యులు వివరించారు. ఆరు నెలలుగా.. కుడి కంటి చూపు మసకబారి, తలనొప్పితో బాధపడుతున్న మహిళ (54) ఏఐజీ వైద్యులను సంప్రదించారు.

పరీక్షించిన వైద్యులు ఆమె ‘స్ఫీనో ఆర్బిటల్‌ కావెర్నస్‌ మెనింజియోమా (ఎస్‌వోఎం)’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కంటి వెనుక భాగంలో ఉండే స్ఫీనాయిడ్‌ ఎముకకు, ఐ సాకెట్‌కు, కార్వీనియస్‌ సైన్‌సకు మధ్య ఉండే భాగంలో నిరపాయకరమైన ఏర్పడే కణితిని ఇలా వ్యవహరిస్తారు. దీనిని కనురెప్ప పై భాగంలో గాటు ద్వారా తొలగించినట్లు ఏఐజీ న్యూరో సర్జన్లు వివరించారు.

ఈ విధానంలో చికిత్స చేయడం వల్ల మెదడుపై ఎలాంటి దుష్ప్రభావం పడదని, రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉందని వారు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని రెండోరోజే ఇంటికి పంపినట్టు తెలిపారు.

కాగా.. అరుదైన ఈ శస్త్రచికిత్స చేసిన వైద్య బృందంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ అభిరామ చంద్ర గబ్బిట, డాక్టర్‌ సుబోధ్‌ రాజు (డైరెక్టర్‌- న్యూరోసర్జరీ) తదితరులు ఉన్నారు. కాగా.. అత్యంత అరుదైన సర్జరీ చేసిన వైద్యులను ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర రెడ్డి అభినందించారు.

Updated Date - Aug 28 , 2024 | 03:58 AM