Hyderabad : డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jul 17 , 2024 | 04:49 AM
డ్రగ్స్, సైబర్ నేరాల విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్ర స్థాయి (ఫిజికల్ పోలీసింగ్)లో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారులపై కనిపించాలని సూచించారు.
డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి: ముఖ్యమంత్రి
త్వరలో నేను పర్యటిస్తా: డీజీపీ
డ్రైవ్ ఆన్ డ్రగ్స్‌ను నిర్వహించాలి
రాత్రిళ్లు ఫుడ్ కోర్టులు నిర్వహించేవారిని ఇబ్బంది పెట్టొద్దు
కమిషనర్లు, ఎస్పీల భేటీలో సీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 16(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్, సైబర్ నేరాల విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్ర స్థాయి (ఫిజికల్ పోలీసింగ్)లో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారులపై కనిపించాలని సూచించారు. కమిషనర్లు, ఎస్పీలు తమ పరిధిలోని స్టేషన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, క్రమంతప్పకుండా సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, డ్రగ్స్ కట్టడి ఎజెండాగా డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కమిషనర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతలపై దృష్టిసారించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, పోలీసులకు మధ్య వారధిగా ఉండేందుకు స్టేషన్ల పరిధిలో శాంతి కమిటీలను పునరుద్ధరించాని.. బాధితుల పట్ల మాత్రమే స్నేహంగా ఉండాలని, నేరగాళ్లతో కాదన్నారు. రాత్రి వేళల్లో ఫుడ్ కోర్టులు నిర్వహించేవారిని ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఐటీ రంగంలో వారు రాత్రి వేళల్లో పని చేయాల్సి ఉంటుందని.. ఈ విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. కాగా, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇదే వివరాలను గణాంకాలతో మీడియాకు వెల్లడించాలని సీఎం ఆదేశించారు.
విదేశీయులపై దృష్టిపెట్టండి
డ్రగ్స్ కేసుల్లో విదేశీయుల ప్రమేయం నేపథ్యంలో.. వారు ఏ పని మీద వస్తున్నారు? ఏం చేస్తున్నారనేదానిపై దృష్టిసారించాలని సీఎం నిర్దేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ బానిసలు, వాడకందారులను డీ అడిక్షన్ కేంద్రాల్లో ఉంచాలని, అందుకోసం చర్లపల్లి జైల్‌ను వినియోగించుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో కదలాలన్నారు. మానమ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని విభాగాలు కదలాని పేర్కొన్నారు. కాగా, కొల్లాపూర్ బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్‌ను సీఎం ఆదేశించారు. తనపై ఆరోపణలు వచ్చినందున సిట్ వేయాలని డీజీపీకి లేఖ రాసినట్లు మంత్రి జూపల్లి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేసును వీలైనంత త్వరగా పరిష్కరించి నిందితులను పట్టుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపాలని కమిషనర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు.