Hyderabad: ‘మహా’ అధికారికి ఏసీబీ నోటీసులు.. ఇప్పటికే పలు దఫాలుగా వివరణ
ABN , Publish Date - May 03 , 2024 | 10:47 AM
గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్దారించి హెచ్‌ఎండీఏ(HMDA)లో అడ్మినిస్ర్టేటివ్ నిర్వహణ చేపట్టే కీలక రెవెన్యూ అధికారికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
- రేపో, మాపో అదుపులోకి తీసుకునే అవకాశం
- భవన నిర్మాణ అనుమతుల్లో అత్యుత్సాహమే కారణం
హైదరాబాద్ సిటీ: గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్దారించి హెచ్‌ఎండీఏ(HMDA)లో అడ్మినిస్ర్టేటివ్ నిర్వహణ చేపట్టే కీలక రెవెన్యూ అధికారికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ అధికారుల కస్టడీలో వెల్లడించిన అంశాల ఆధారంగానే నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. శివబాలకృష్ణ(Shiva Balakrishna) వెల్లడించిన అంశాల ఆధారంగా ఇప్పటికే పలు దఫాలుగా ఏసీబీ అధికారులు అడ్మినిస్ర్టేటివ్ నిర్వహణ కీలక అధికారి నుంచి వివరణ తీసుకున్నట్లు సమాచారం. కానీ ఆ సందర్భంలో ఏసీబీ(ACB) అధికారులకు సహకరించకుండా పూర్తిగా తనకు సంబంధం లేదనట్లుగా వ్యవహరించినట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి: Hyderabad: అడుగు బయట పెడితే అంతే.. అప్పటి వరకు వడగాల్పులు తప్పవు: ఐఎండీ
హెచ్‌ఎండీఏలో మెట్రోపాలిటన్ కమిషనర్ తర్వాత అత్యంత కీలకంగా ఉండే అడ్మినిస్ర్టేటివ్ అధికారి గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం చేసినట్లు తెలిసింది. సదరు అధికారి కొన్ని భవన నిర్మాణ అనుమతుల్లో అత్యుత్సాహం ప్రదర్శించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగానికి చెందిన అధికారి కావడంతో భవన నిర్మాణ అనుమతులకు రెవెన్యూ పరమైన అంశాల్లో సహకరించడంతో పాటు పెద్దఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో తానే ముందుండి డెవలపర్లతో మాట్లాడుకొని పలు దస్ర్తాలను క్లియర్ చేయించినట్లుగా ఏసీబీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల సందర్భంలో రెవెన్యూపరమైన సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారే ఫిర్యాదుదారులతో, దరఖాస్తుదారులతో భూవివాదాలపై విచారణ (హియరింగ్) చేపడతారు. ఈ ప్రక్రియలో కూడా ఏ రోజు హియరింగ్ జరుగుతుందనే సమాచారాన్ని ఫిర్యాదుదారులకు, ఇటు దరఖాస్తుదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇరుపక్షాలు హాజరైన తర్వాత వారి సమక్షంలో నిజాలను నిర్ధారించిన తర్వాతే భూమి టైటిల్ క్లియర్ ఉన్నట్లుగా క్లియరెన్స్ ఇస్తారు. భూమి టైటిల్ క్లియర్ లేకుంటే సివిల్ కోర్టులో తేల్చుకొని రావాలని సూచిస్తారు. ఈ హియరింగ్ ప్రక్రియలో ఫిర్యాదుదారులకు సమాచారమివ్వకుండా దరఖాస్తుదారులతో కుమ్మక్కై పెద్దఎత్తున సెటిల్ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. నార్సింగిలో 12 ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మల్టీస్టోర్ బిల్డింగ్ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా, ఆ 12ఎకరాల్లో భూవివాదమున్నా, హియరింగ్ పేరుతో దరఖాస్తుదారుడికి అనుకూలంగా వ్యవహరించడంతో కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి: కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు 6కు వాయిదా
రేపో, మాపో అదుపులోకి తీసుకునే అవకాశం
హెచ్‌ఎండీఏలో ఇటీవల ఏసీబీ అధికారులు వరుసగా సోదాలు నిర్వహించిన సందర్భంలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులకు సంబంధించి వచ్చే దరఖాస్తుల్లో మొదటగా పార్ట్‌బీ (రెవెన్యూ పరమైన అంశాలు) పరిశీలించే ఓ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు వివిధ అంశాలపై కూలంకశంగా అడిగినట్లు తెలిసింది. పార్ట్‌బీ క్లియరెన్స్ సందర్భంలో హెచ్‌ఎండీఏ అడ్మినిస్ర్టేటివ్ నిర్వహణ అధికారి పాత్రనే ప్రముఖంగా ఉన్నట్లు గుర్తించారని సమాచారం. శివబాలకృష్ణ వెల్లడించిన అంశాల ఆధారంగా.. హెచ్‌ఎండీఏలో ఏసీబీ అధికారులు సోదాల సందర్భంలో బయటపడిన అంశాలను రూడీ చేసుకొని, హెచ్‌ఎండీఏ అడ్మినిస్ర్టేటివ్ నిర్వహణ అధికారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అవసరమైతే రేపో, మాపో అదుపులోకి తీసుకొని ఏసీబీ కార్యాలయంలో విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే శివబాలకృష్ణ ఏసీబీ కేసుతో హెచ్‌ఎండీఏపై అవినీతి మకిలీ అంటుకోగా.. హెచ్‌ఎండీఏలో అడ్మినిస్ర్టేటివ్ నిర్వహణలో కీలకంగా ఉన్న రెవెన్యూఅధికారిని అదుపులోకి తీసుకుంటే ఎన్నికల వేళ సంచలనంగా మారనుంది. అయితే, డిప్యూటేషన్‌పై వచ్చే అధికారులతో హెచ్‌ఎండీఏ అప్రదిష్ట పాలవుతున్నదని, 15ఏళ్లుగా హెచ్‌ఎండీఏలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగ సంఘం నాయకురాలు అభిప్రాయపడ్డారు.
ఇధికూడా చదవండి: Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్
Read Latest Telangana News And Telugu News
Read Latest AP News and Telugu News