Hyderabad : నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ షురూ
ABN , Publish Date - Aug 14 , 2024 | 04:02 AM
దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. కోకాపేటలోని బహుళ అంతస్తుల జీఏఆర్ టవర్‌లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు.
కోకాపేటలో ప్రారంభించనున్న సీఎం
కొరియా నుంచి రాగానే కార్యక్రమం
హైదరాబాద్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు చెందిన మరో క్యాంపస్ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. కోకాపేటలోని బహుళ అంతస్తుల జీఏఆర్ టవర్‌లో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు.
దక్షిణ కొరియా పర్యటన నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకోనున్న వీరు.. తర్వాత కాగ్నిజెంట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కొత్త క్యాంపస్ ద్వారా 15 వేల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఉమ్మడి ఏపీలో 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో తొలి కార్యాలయం ప్రారంభించింది కాగ్నిజెంట్.
ప్రస్తుతం నాలుగుచోట్ల మొత్తం 18 వేల ఉద్యోగులున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో మరింత ముందుకెళ్లాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఐదో క్యాంపస్ నెలకొల్పనున్నట్టు కాగ్నిజెంట్ గతంలో ప్రకటించింది. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆసక్తి కనబరిచింది. కాగా, అమెరికా పర్యటనలో ఉన్న సీఎంతో ఈనెల 5న కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సమావేశమై కొత్త క్యాంప్‌సను ప్రకటించారు.
ర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా పలు అధునాతన సాంకేతికతలపై ఇక్కడ ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని తెలిపారు. మరోవైపు రెండేళ్లలో కాగ్నిజెంట్ రాష్ట్రంలోని 34 వివిధ విద్యా సంస్థల నుంచి 7,500 మందిని నియమించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి రూ.7,725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేయగా.. ఐదేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.22.5 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపట్టింది.