Share News

Bonalu Festival: బోనమెత్తిన భాగ్యనగరం..

ABN , Publish Date - Jul 29 , 2024 | 03:16 AM

నెత్తిన బోనమెత్తిన ఆడబిడ్డల భక్తి పారవశ్యం.. అమ్మవారు ఆవహించి సిగమూగిన శివసత్తుల పూనకం.. ఒంటి నిండా పసుపు ధరించి, ముఖానికి మెరిసే రంగులద్ది, చేతిలో కొరడా ఝళిపిస్తూ పోతరాజుల వీరంగం.. డప్పు చప్పుళ్లు, పోరగాళ్ల చిందుల నడుమ ఆదివారం హైదరాబాద్‌ వ్యాప్తంగా బోనాల పండుగ జోరుగా సాగింది.

Bonalu Festival: బోనమెత్తిన భాగ్యనగరం..

  • హైదరాబాద్‌లో ఘనంగా ఉత్సవాలు.. పాత బస్తీలో అంబరాన్నంటిన వేడుకలు

  • లాల్‌ దర్వాజ గుడికి పోటెత్తిన భక్తజనం.. అమ్మవారి సన్నిధిలో ప్రముఖుల పూజలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): నెత్తిన బోనమెత్తిన ఆడబిడ్డల భక్తి పారవశ్యం.. అమ్మవారు ఆవహించి సిగమూగిన శివసత్తుల పూనకం.. ఒంటి నిండా పసుపు ధరించి, ముఖానికి మెరిసే రంగులద్ది, చేతిలో కొరడా ఝళిపిస్తూ పోతరాజుల వీరంగం.. డప్పు చప్పుళ్లు, పోరగాళ్ల చిందుల నడుమ ఆదివారం హైదరాబాద్‌ వ్యాప్తంగా బోనాల పండుగ జోరుగా సాగింది. ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలోని అమ్మవారి ఆలయాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. ఇక్కడి ప్రముఖ ఆలయమైన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవస్థానంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాకాళికి కొత్త బట్టలు పెట్టి, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా లాల్‌దర్వాజలో ఉత్సవాలు జరిగే రోజునే నగరవాసులందరూ బోనాల పండుగను జరుపుకుంటారు. పండుగ సందర్భంగా నగరంలోని వివిధ ఆలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు కోళ్లు, యాటలతో భక్తులు మొక్కులు చెల్లించారు.

9.jpg


మహిళలు అమ్మవార్లకు తొట్టెలు కట్టారు. విద్యుత్‌ దీపాల వెలుగులు, రంగు రంగుల పూలతో చేసిన అలంకరణలతో ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. బోనాల నేపథ్యంలో నగరంలోని వివిధ ఆలయాలకు రాజకీయ ప్రముఖులు తరలివెళ్లారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. చార్మినార్‌ శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అమీర్‌పేటలోని కనకదుర్గ అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. లోయర్‌ట్యాంక్‌ బండ్‌ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు పూజలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీర్‌ ఆలం మండి మహా కాళేళ్వర ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jul 29 , 2024 | 03:16 AM