Hyderabad: మెట్రోలో అర్ధరాత్రి వరకు కిటకిట.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:30 PM
ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్(IPL match) సందర్భంగా మెట్రో రైళ్లలో అర్ధరాత్రి వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
హైదరాబాద్ సిటీ: ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్(IPL match) సందర్భంగా మెట్రో రైళ్లలో అర్ధరాత్రి వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో మెట్రో అధికారులు రైళ్ల సమయాన్ని అదనంగా పొడిగించారు. ఈ మేరకు చివరి రైలును అర్ధరాత్రి 12.15 గంటల వరకు నడిపించారు. కాగా, రాత్రివేళ ప్రవేశం కల్పించిన నాగోలు, ఉప్పల్ స్టేడియం(Uppal Stadium), ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి ప్రయాణికులు తరలివెళ్లారు. కేవలం ఉప్పల్ స్టేడియం నుంచే దాదాపు 28వేల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు 5 లక్షల మంది ఉండగా.. బుధవారం మ్యాచ్ సందర్భంగా 5.28 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఇదిలా ఉండగా, మ్యాచ్ ముగిసిన వెంటనే ఉప్పల్ స్టేడియం స్టేషన్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో 20 నిమిషాల పాటు మెట్రో ప్రవేశద్వారం మూసివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ఆర్టీసీ బస్సుల ద్వారా సికింద్రాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరారు.