Share News

Hyderabad : స్థిరవేతనాల హామీ అమలు చేయాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 04:44 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థిర వేతనాలు ఇవ్వాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పథకంలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

Hyderabad : స్థిరవేతనాల హామీ అమలు చేయాలి

  • ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్‌

  • కుటుంబ సంక్షేమశాఖ కమిషనరేట్‌ ముందు మహాధర్నా

హైదరాబాద్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థిర వేతనాలు ఇవ్వాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పథకంలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎన్‌హెచ్‌ఎం ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ధర్నాలో ఆశావర్కర్లు, సెకండ్‌ ఏఎన్‌ఎమ్‌లతోపాటు వేల మంది ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

కోఠిలోని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా... కాంట్రాక్టు ఉద్యోగులకు క్యాడర్‌ను నిర్ణయించి, కనీస వేతనాన్ని(బేసిక్‌ పే) అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో 78 రకాల క్యాడర్లలో సుమారు 17 వేల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారని, అందరికి స్థిర వేతనాలిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనేక సందర్భాలలో ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని, ధర్నాలు కూడా చేశామని, అయినా వారిలో చలనం కలగలేదన్నారు.

అందుకే మహాధర్నా చేపట్టామన్నారు. ప్రభుత్వం, అధికారులు తమ సమస్యలను పరిష్కరించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. కమిషనర్‌ కర్ణన్‌... కొంతమంది నేతలను కలిసి, వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 04:44 AM