Hyderabad: పోలీసుకు నిర్వచనం.. చదువుకు ప్రాధాన్యం..
ABN , Publish Date - Aug 17 , 2024 | 10:34 AM
‘ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు అవసరమైతే ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవారే పోలీస్’ అంటూ.. శిక్షణా సమయంలో ఉన్నతాధికారులు చెబుతుంటారు.
- ప్రాణాలు పోతున్నా లెక్కచేయని యోధుడు
- కత్తిపోట్లు పడుతున్నా పట్టువీడని ధీరుడు
- రాష్ట్రపతి గాలంటరీ మెడల్ అందుకున్న ఒకేఒక్కడు
- హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను పలకరించిన ‘ఆంధ్రజ్యోతి’
- ప్రాణాలు పోతాయని తెలిసినా దొంగలతో ఢీ
- మూడు సర్జరీలు.. 3 నెలలు విశ్రాంతితో విధుల్లోకి
హైదరాబాద్ సిటీ: ‘ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేందుకు అవసరమైతే ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేవారే పోలీస్’ అంటూ.. శిక్షణా సమయంలో ఉన్నతాధికారులు చెబుతుంటారు. అయితే ఆ మాటను సీరియస్‌గా తీసుకొని, విధినిర్వహణలో ఆచరించేవారు తక్కువ మందే ఉంటారనడం అతిశయోక్తి కాదు. అయితే శిక్షణలో చెప్పిన మాటలను నిజంగా ఆచరించిన యోధుడు హెడ్ కానిస్టేబుల్(Head Constable) యాదయ్య. విధి నిర్వహణలో భాగంగా కరడుగట్టిన దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన యాదయ్య.. వారి చేతిలో తుపాకులు, కత్తులు ఉన్నా లెక్కచేయలేదు.
ఇదికూడా చదవండి: Hyderabad: అమెరికా కల.. సాకారం ఇలా..
కత్తులతో పొడిచినా పట్టువిడవలేదు. ప్రాణాలు పోతాయని తెలిసినా.. నేరస్థులకు ఎదురొడ్డాడు. ఆ సమయంలో తన గురించి గానీ, తన కుటుంబం గురించి గానీ ఆలోచించలేదు. వెనుకడుగు వేయలేదు. ధైర్యంగా పోరాడి కరడుగట్టిన దొంగలను పట్టుకొని స్నాచింగ్‌తో పాటు, ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టించాడు. పోలీస్ అనే పదానికి సరైన నిర్వచనంగా నిలిచాడు. దీంతో ఈ ఏడాది దేశంలోనే రాష్ట్రపతి గాలంటరీ మెడల్ అందుకున్న ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పోలీస్ డిపార్టుమెంట్‌లో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. కొన్ని సంఘటనలను ఈసందర్భంగా ఆయన పంచుకున్నారు. ఇంటిపేరుకు తగ్గట్టే కొడుకు చదువు కోసం పరితపించారు.
తెల్లారితే కొడుకును ఎంసెట్ పరీక్షకు తీసుకెళ్లాలి..
నగరంలో 2022 జూలై 25న సాయంత్రం 72 ఏళ్ల మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలో నుంచి బంగారు చైన్‌ను తెంపుకెళ్లారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. కర్ణాటక రాష్ట్రం కలబురిగికి చెందిన కరడుగట్టిన నేరగాళ్లుగా గుర్తించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా రామచంద్రాపురం పరిధిలోని అశోక్‌నగర్ పరిసరాల్లో దొంగల ముఠా ఉన్నట్లు సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రవి, దేబాష్ జూలై-26న రంగంలోకి దిగారు. దొంగలు యాదయ్యపై తిరగబడ్డారు. కత్తులతో దారుణంగా దాడిచేశారు. చాతీ, వీపు, కడుపుపై 7 బలమైన పోట్లు పొడిచారు. తీవ్రంగా రక్తం కారుతున్నా లెక్కచేయకుండా దొంగలను పట్టిన పట్టు యాదయ్య విడవలేదు. ఇద్దరు ఘరానా దొంగలు ఇషాన్ నిరంజన్ నీలంపల్లి, రాహుల్‌లను అరెస్టు చేశారు.
కత్తిపోట్లకు గురైన యాదయ్యను పోలీసులు ముందుగా బీరంగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఏఐజీకి తరలించారు. తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్న యాదయ్యకు మదిలో ఒకే ఒక్క ఆలోచన మెదులుతోంది. తెల్లారితే కొడుకును ఎంసెట్ ఎగ్జామ్‌కు తీసుకెళ్లాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష మిస్ కావొద్దు. ఇప్పుడెలా..? ఎవరైనా ఫోన్ ఇస్తే బాగుండు అనుకున్నాడు. ట్రీట్‌మెంట్ చేస్తున్న నర్స్‌ను ఫోన్ అడిగాడు. ఇంటికి ఒక్క ఫోన్ చేసుకోవాలి అని రిక్వెస్టు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో వద్దని ఆమె వారించింది. కొడుకు విషయం చెప్పగానే సరేనంటూ ఫోన్ చేసి కుటుంబసభ్యులతో మాట్లాడించింది. తనకేం కాదని, కొడుకు ఎగ్జామ్ మిస్ కావొద్దని భార్యతో చెప్పగానే.. ‘మేమంతా ఉన్నాం. పరీక్ష సంగతి మేం చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి’ అని ఆమె చెప్పడంతో దిగులంతా పోయిందని నిబ్బరంగా చెప్పారు యాదయ్య.
అండగా నిలిచిన డిపార్టుమెంట్..
కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీస్ డిపార్టుమెంట్ తనకు అండగా నిలిచిందని, ఉన్నతాధికారులు తనను చూసుకున్న విధానం తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు యాదయ్య. ‘నన్ను చూడ్డానికి వచ్చే బంధువులు, కుటుంబసభ్యుల కోసం ఆస్పత్రిలో ప్రత్యేకంగా రెండు గదులు కేటాయించేలా అప్పటి సీపీ స్టీఫెన్ సార్ చర్యలు తీసుకున్నారు. చికిత్స పొందినంతకాలం కుటుంబానికి, బంధువులకు ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించారు. ఇన్‌స్పెక్టర్ సంజయ్ కుమార్ సార్ ఆసుపత్రికి వచ్చి ఎప్పటికప్పుడు పరామర్శించేవారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు యాదయ్య ప్రాణాలు కాపాడాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని పోలీస్ ఉన్నతాధికారులు రిక్వెస్టు చేసినట్లు వెల్లడించారు. పైసా కూడా నేను ఖర్చుపెట్టకుండా చూసుకున్నారు. అదీ డిపార్టుమెంట్ గొప్పతనం’ అని యాదయ్య హుందాగా వెల్లడించారు.
మూడు నెలల్లోనే విధుల్లోకి..
ఏడు కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన యాదయ్యకు 3 సర్జరీలు జరిగాయి. 18 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్చి అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడూ తనకు జరిగిన గాయాల గురించి గానీ, తనకేమైనా అయితే కుటుంబ పరిస్థితి ఏంటనిగానీ ఆలోచించలేదు. చిన్ని చిన్న వ్యాయామాలు చేస్తూ.. ధైర్యాన్ని కూడగట్టుకొని, తిరిగి విధుల్లోకి వెళ్లాలనే సంకల్పంతో సరిగ్గా మూడు నెలల్లో తిరిగి విధుల్లో చేరారు. వైద్యుల సలహా మేరకు భోజనం విషయంలో, ఆరోగ్యం విషయంలో, బరువులు ఎత్తే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News