Hyderabad: డివైడర్ గాయబ్.. సెంట్రల్ లైటింగ్ ఔట్..
ABN , Publish Date - Dec 14 , 2024 | 01:41 PM
బడంగ్‌పేట్(Badangpet)లో రూ.7.50కోట్ల వ్యయంతో విస్తరించిన ప్రధాన రహదారిలో ప్రస్తుతం ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరించి, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత మరో రూ.50లక్షలు వెచ్చించి సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేశారు.
- లైట్లు బిగించిన నాలుగు నెలలకే తొలగింపు
- నిధులు వృథా.. పెట్టాలంటే మళ్లీ టెండర్లు పిలవాల్సిందే
- ట్రాఫిక్‌తో వాహనదారుల ఇబ్బందులు
- బడంగ్‌పేట్ ప్రధాన రహదారిలో ఇదీ పరిస్థితి
సరూర్‌నగర్(హైదరాబాద్): బడంగ్‌పేట్(Badangpet)లో రూ.7.50కోట్ల వ్యయంతో విస్తరించిన ప్రధాన రహదారిలో ప్రస్తుతం ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరించి, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత మరో రూ.50లక్షలు వెచ్చించి సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అక్కడ కొంత దూరం డివైడర్‌గానీ, సెంట్రల్ లైటింగ్‌గానీ కనిపించని పరిస్థితి..! బడంగ్‌పేట్ మెయిన్ రోడ్డులో అల్మా్‌సగూడకు వెళ్లే చౌరస్తా నుంచి పాత గ్రామ పంచాయతీ కూడలి వరకు గతంలో నిర్మించిన డివైడర్, సెంట్రల్ లైటింగ్(Divider, central lighting) మాయమైపోయాయి. ఎనిమిది నెలల పాటు డివైడర్, నాలుగు నెలల పాటు విద్యుత్ లైట్లు కనిపించగా.. ఆ తర్వాత ఆ రెండూ గాయబ్ కావడం గమనార్హం! నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారిలో డివైడర్ తప్పనిసరి కాగా, ప్రస్తుతం డివైడర్ లేకపోవడంతో సదరు మెయిన్ రోడ్డులో వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా మారింది.
ఈ వార్తను కూడా చదవండి: Cybercriminal: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్ డీపీ మార్చి.. మెసేజ్ పంపి..
ఓ సారి తొలగించి.. మళ్లీ నిర్మించి.. మరోసారి తొలగించి..
బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని ఉద్యోగ్‌నగర్ కమాన్ నుంచి గాంధీనగర్ చౌరస్తా(పాలిటెక్నిక్ కాలేజీ) వరకు రహదారి విస్తరణకు రూ.7.50కోట్లు ఎల్‌ఆర్‌ఎస్ నిధులు మంజూరు కాగా, 2021 ఫిబ్రవరి 8న అప్పటి మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. బడంగ్‌పేట్ గ్రామానికి ఇరువైపులా రోడ్డు విస్తరణ సాఫీగానే సాగినప్పటికీ.. గ్రామం మధ్యలో మాత్రం అవరోధాలు ఎదురయ్యాయి. అనేక నివాస గృహాలు తొలగించాల్సి రావడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దాంతో విస్తరణ మాట పక్కనబెట్టి.. ఆ ప్రదేశంలో కేవలం డివైడర్ మాత్రమే నిర్మించారు.
అనంతరం మొత్తం రహదారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి రూ.50లక్షలు కేటాయించి 2022 జూన్ 7వ తేదీన మేయర్ పారిజాతారెడ్డి, కార్పొరేటర్లు కలిసి శంకుస్థాన చేశారు. ఎట్టకేలకు రహదారి విస్తరణ చేపట్టకుండానే డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేసి మమ అనిపించుకున్నారు. కాగా మొదట్లో డివైడర్ నిర్మించిన కొన్నాళ్లకే వినాయక చవితి రావడంతో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు డివైడర్ అడ్డంకిగా మారిందంటూ 2022 సెప్టెంబరులో డివైడర్‌ను పూర్తిగా తొలగించేశారు. ఆ తర్వాత మళ్లీ డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయగా.. 2023లో గణేశ్ శోభాయాత్ర సందర్భంగా మరోసారి ఆ రెండింటినీ తొలగించేశారు.
విద్యుత్ స్తం భాలు తొలగించి మునిసిపల్ భవనం ఎదురుగా గల ప్రజాభవన్ పక్కన పడేసి, వాటికి ఉన్న విద్యుత్ లైట్లను రోడ్డు పక్కన గల స్తంభాలకు బిగించారు. డివైడర్‌ను పూర్తిగా తొలగించి రోడ్డును మునిపటిలాగే చదునుగా మార్చేశారు. దాంతో ప్రస్తుతం అటు ఉద్యోగ్‌నగర్ నుంచి అల్మా్‌సగూడ చౌ రస్తా వరకు.. ఇటు గాంధీనగర్ నుంచి బడంగ్‌పేట్ పాత గ్రామ పంచాయతీ కూడలి వరకు మాత్రమే డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఉండగా.. మిగతా ప్రాంతంలో అవి రెండూ మాయమయ్యాయి.
వ్యాపార సంస్థల ఎదుట అక్రమ పార్కింగ్‌తో అవస్థలు
ఇక్కడ డివైడర్ తొలగింపుతో స్థానిక వ్యాపార సంస్థల ఎదుట అక్రమ పార్కింగ్ చేస్తున్నారు. దాంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. డివైడర్ ఉన్నప్పుడు షాపుల వద్ద అక్రమ పార్కింగ్‌కు అడ్డుకట్ట పడ్డదని, ఇప్పుడు ఎప్పటిలాగే అక్రమ పార్కింగ్‌తో రోడ్డంతా గందరగోళంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. ఈ దృష్ట్యా గతంలో నిర్మించి తొలగించిన ప్రదేశంలో మళ్లీ డివైడర్ నిర్మించి వెంటనే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మళ్లీ టెండర్ పిలవాల్సిందేనా ?
గతంలో మంజూరైన నిధులతో కాంట్రాక్టర్ పనులు చేయగా.. ఆ తర్వాత వాటి తొలగింపుతో అతడికి సంబంధం ఉండదని ఓ అధికారి పేర్కొన్నారు. దాంతో అక్కడ మళ్లీ డివైడర్ నిర్మించాలన్నా, దానిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నా తాజాగా మళ్లీ టెండర్ పిలవక తప్పదని అంటున్నారు. ఒక రకంగా ఇది నిధుల దుర్వినియోగం కిందకే వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకనైనా అధికారులు, పాలకులు స్పందించి ఏదో ఒక రకంగా అక్కడ డివైడర్ నిర్మాణంపై, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుపై దృష్టిపెట్టి సత్వర చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే రహదారి విస్తరణకు గల అడ్డంకులను అధిగమించి నివాస గృహాల యజమానుల నుంచి సానుకూల అభిప్రాయం వచ్చేలా చూడాలని సూచిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు
ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి
ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో
Read Latest Telangana News and National News