Share News

TG Politics: ‘దానం’ను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు..!

ABN , Publish Date - Mar 17 , 2024 | 11:48 AM

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Dana Nagender) తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలను కలవడంతో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం మొదలైంది.

TG Politics: ‘దానం’ను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దు..!

- గాంధీభవన్‌ ఎదుట ఖైరతాబాద్‌వాసుల ధర్నా

- దానంకు అనుకూలంగా మరో వర్గం నినాదాలు

హైదరాబాద్‌ సిటీ: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Dana Nagender) తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలను కలవడంతో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం మొదలైంది. రేపో, మాపో కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలోనే మూడు రంగుల కండువా కప్పుకుంటారని, సికింద్రాబాద్‌ కానీ, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారని జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గాంధీభవన్‌ ఎదుట శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ‘దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే, భూ కబ్జాదారుడు సుధీర్‌గౌడ్‌ బినామీ-ప్రకా్‌షనగర్‌ ఎక్స్‌టెన్‌షన్‌ బేగంపేటవాసుల’ పేరుతో ఉన్న బ్యానర్‌ను పట్టుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు గాంధీభవన్‌ మెట్లపై కూర్చోని ధర్నా చేశారు. హైకోర్టు నుంచి ఆర్డర్‌ ఉన్నప్పటికీ కబ్జా కోసం యత్నిస్తున్నావారిని శిక్షించాలని, దానం నాగేందర్‌, సుధీర్‌గౌడ్‌లు భూకబ్జాదారులతో కుమ్మక్కై తమను బస్తీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్లకార్డులను ప్రదర్శించారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో పాటు బస్తీవాసులు గాంధీభవన్‌ ఎదుట సుమారు రెండు గంటలకు పైగా ధర్నాకు దిగారు. గాంధీభవన్‌ నేతలు ఆందోళన చేస్తున్నవారికి సర్దిచెప్పి పంపించారు.

దానంకు అనుకూలంగా మరో వర్గం..

దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసిన కొంతసేపటికి దానం అనుచరులు కొంతమంది వచ్చి అనుకూల నినాదాలు చేశారు. దానం నాగేందర్‌ కాంగ్రె్‌సలో చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందని, సొంతగూటికి రావడాన్ని పార్టీ శ్రేణులు స్వాగతించాలని కోరారు.

ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌లో రాజుకుంటున్న వేడి

దానం నాగేందర్‌ సొంతగూటికి చేరుతుండడంతో ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌లో వేడి రాజుకుంటోంది. గాంధీభవన్‌ ఎదుట దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేయడం వెనుక పలువురు నేతలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్‌ ఏ పార్టీలో ఉన్నా ఖైరతాబాద్‌ టికెట్‌ ఆశిస్తుండగా, ఇతరులకు టికెట్లు దక్కడం లేదనే అభిప్రాయాలున్నాయి. అయితే ఇప్పటికే ఆయా నేతలు కూడా దానం నాగేందర్‌ను పార్టీలోకి తీసుకుంటే.. తమ భవిష్యత్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని పార్టీ అధినేతల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిసింది.

Updated Date - Mar 17 , 2024 | 12:25 PM