Share News

Hyderabad: గ్రేటర్‌ ఆర్టీసీకి భారంగా ‘మహాలక్ష్మి’

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:34 AM

మహాలక్ష్మి(Mahalakshmi) ఉచిత ప్రయాణంతో గ్రేటర్‌లో బస్‌ టికెట్ల ఆదాయం భారీగా తగ్గింది. గతంలో రోజుకు రూ.4 కోట్ల నుంచి 4.5 కోట్ల ఆదాయం వస్తే ఉచిత ప్రయాణం ప్రారంభం తర్వాత రూ. 2.5 కోట్ల నుంచి 3 కోట్లు మాత్రమే వస్తున్నది. అంటే రోజుకు సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం తగ్గింది.

Hyderabad: గ్రేటర్‌ ఆర్టీసీకి భారంగా ‘మహాలక్ష్మి’

- రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల్లో సర్కారు ఆలస్యం

మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో సిటీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయినా, ఆర్టీసీ ఆర్థిక కష్టాల నుంచి మాత్రం గట్టెక్కలేకపోతున్నది.

హైదరాబాద్‌ సిటీ: మహాలక్ష్మి(Mahalakshmi) ఉచిత ప్రయాణంతో గ్రేటర్‌లో బస్‌ టికెట్ల ఆదాయం భారీగా తగ్గింది. గతంలో రోజుకు రూ.4 కోట్ల నుంచి 4.5 కోట్ల ఆదాయం వస్తే ఉచిత ప్రయాణం ప్రారంభం తర్వాత రూ. 2.5 కోట్ల నుంచి 3 కోట్లు మాత్రమే వస్తున్నది. అంటే రోజుకు సుమారు రెండు కోట్ల వరకు ఆదాయం తగ్గింది. ఈ లెక్కన నెలకు రూ. 60-70 కోట్ల ఆదాయం తగ్గింది. జీరో టికెట్ల చార్జీలను ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నా సమయానికి నిధులు అందకపోవడంతో ఆర్టీసీలో ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. గ్రేటర్‌జోన్‌(Greater Zone)లో ఆర్టీసీ 2,800 బస్సులు నడుపుతుండగా డీజిల్‌ ఖర్చులకే రోజుకు రూ. 1.5 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్టీసీకి రూ.1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల నిధులు కేటాయిస్తే పెద్దసంఖ్యలో ఎలక్ర్టిక్‌ బస్సులు కొనేందుకు అవకాశముంటుందని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కార్మికసంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గ్రేటర్‌జోన్‌లో రెండు వేల నాన్‌ ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులు నడిపితే డీజిల్‌ ఖర్చులు తగ్గడంతో పాటూ ఆర్టీసీ నష్టాలు భారీగా తగ్గించుకునే అవకాశాలు మెరుగుపడుతాయని రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు.

బస్‌పాస్‏లపై ఎఫెక్ట్‌..

ఉచిత ప్రయాణంతో బస్‌పాస్‏ల సంఖ్య భారీగా తగ్గింది. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు గ్రేటర్‌జోన్‌లో 4 లక్షల బస్‌పా్‌సలుంటే, నేడు 2.82 లక్షలే ఉన్నాయి. ఆదాయం నెలకు రూ. 15 కోట్ల వరకు తగ్గింది. టికెట్ల ఆదాయంతోపాటు పాస్‌ల ఆదాయం తగ్గడంతో గ్రేటర్‌జోన్‌లో రోజు వారీ ఖర్చులకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణానికి సంబంధించి రీయింబర్స్‌మెంట్‌ నిధులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్న గ్రేటర్‌ అధికారులు ఆ లెక్కలు మాత్రం వెల్లడించడం లేదు.

ఇదికూడా చదవండి: రాముడు దేవుడు.. కానీ ఆయనను ఓ పార్టీకి లీడర్‌ను చేశారు

Updated Date - Apr 13 , 2024 | 07:40 AM