Telangana: ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడి మృతి.. స్వదేశానికి తీసుకురావాలని అసద్ విజ్ఞప్తి
ABN , Publish Date - Mar 06 , 2024 | 07:37 PM
ఉద్యోగం ఇప్పిస్తామని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి రష్యాకు వెళ్లాడు ఓ యువకుడు. తీరా ఉద్యోగం పేరుతో రష్యా సైన్యంలో అతన్ని చేర్పించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌కి చెందిన ఆ యువకుడి కుటుంబంలో విషాదం నింపింది.
కీవ్: ఉద్యోగం ఇప్పిస్తామని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి రష్యాకు వెళ్లాడు ఓ యువకుడు. తీరా ఉద్యోగం పేరుతో రష్యా సైన్యంలో అతన్ని చేర్పించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌కి చెందిన అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. భారత ఎంబసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్(Hyderabad) పాతబస్తీకి చెందిన మహమ్మద్ అర్ఫన్‌ని(30) ఓ కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగం పేరుతో రష్యాకు తీసుకెళ్లింది.
అనంతరం బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చింది. రష్యా - ఉక్రెయిన్‌కి మధ్య ఏడాదికిపైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యువకుడిని రష్యన్ సైన్యం బలవంతంగా యుద్ధంలోకి దింపింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ జరిపిన దాడిలో అర్ఫన్ మృతి చెందాడు. యువకుడు చనిపోయినట్లుగా రష్యన్ ఎంబసీ అతని కుటుంబ సభ్యులకి సమాచారం అందించింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఉద్యోగం ఇస్తామని మోసం చేసి రష్యన్ ఆర్మీలో 20 మంది భారతీయులను చేర్చినట్లు తెలిసిందన్నారు. వారిని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఢిల్లీ, మాస్కోలో ఉన్న రష్యా అధికారులతో భారత్ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోందని జైస్వాల్ చెప్పారు. అర్ఫన్ మృతిపట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంతాపం తెలిపారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన హమీల్ మంగూకియా కూడా ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ జరిపిన దాడిలో మృతి చెందాడు.