Share News

Hyderabad: ట్రేడింగ్‌ పేరిట సైబర్‌ మోసం

ABN , Publish Date - Oct 16 , 2024 | 03:55 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని ఆశపడి.. సైబర్‌ క్రిమినల్స్‌ చేతికి చిక్కిన బాధితుడు రూ. 78.70 లక్షలు పోగొట్టుకున్నాడు.

Hyderabad: ట్రేడింగ్‌ పేరిట సైబర్‌ మోసం

  • 78.70 లక్షలు పోగొట్టుకున్న బాఽధితుడు

  • 39 లక్షలు రికవరీ చేసిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని ఆశపడి.. సైబర్‌ క్రిమినల్స్‌ చేతికి చిక్కిన బాధితుడు రూ. 78.70 లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. రంగంలోకి దిగిన సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. సైబర్‌ క్రిమినల్స్‌ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసి రూ. 39 లక్షలు రికవరీ చేయగలిగారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 34 ఏళ్ల యువకుడికి స్టాక్‌ మార్కెట్లో, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఎంఎస్‌ స్టాక్‌మ్యాక్స్‌లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయని ఆన్‌లైన్‌లో ప్రకటన కనిపించింది.


దాంతో బాధితుడు వెంటనే అందులో రిజిస్టర్‌ అయ్యాడు. ప్రారంభంలో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టగానే మంచి లాభాలు వచ్చాయి. దాంతో మెల్లగా లాభాలకు అలవాటుపడిన బాధితుడు విడతలవారీగా రూ. 78,70,500 పెట్టుబడి పెట్టాడు. ఎక్కువ మొత్తంలో డబ్బులు చేతికి అందగానే అవతలి వ్యక్తులు విత్‌డ్రా ఆప్షన్‌ తొలగించి స్పందించడం మానేశారు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో సైబర్‌ క్రిమినల్స్‌ కొల్లగొట్టిన ఖాతాల్లో ఉన్న రూ. 39 లక్షలు ఫ్రీజ్‌ చేయాలని బ్యాంకు అధికారులకు లేఖలు పంపి ఖాతాలను స్తంభింపజేశారు. త్వరలోనే ఆ డబ్బును న్యాయస్థానం ఆదేశాలతో బాధితుని ఖాతాలో జమ చేస్తామని డీసీపీ తెలిపారు.

Updated Date - Oct 16 , 2024 | 03:55 AM