Share News

TG: వారం పాటు వానలు..

ABN , Publish Date - May 11 , 2024 | 06:39 AM

రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతాచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

TG: వారం పాటు వానలు..

ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో గాలివాన బీభత్సం

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతాచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. వర్షాలకు సంబంధించి మే 12న ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది.


భారీ ఈదురుగాలులకు ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ ప్రధాన రహదారిపై రెండు చెట్లు రోడ్డుపై పడిపోయాయి. మండలంలోని షాంపూర్‌ పంచాయతీ పరిధిలో ఉన్న గోదారిగూడ సమీపంలో ఆదిలాబాద్‌-ఉట్నూర్‌ ప్రధాన రహదారిపై చెట్టు కూలిపోయింది. దందు తండాలో ఈదురు గాలులకు ఇళ్ల పై కప్పుల రేకులు ఎగిరిపోయాయి. నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌, కడెం, దస్తూరాబాద్‌ తదితర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. చాలా గ్రామాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ధాన్యం తడిసిపోయింది. మున్యాల్‌ గ్రామంలో ప్రధాన రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. ఈదురు గాలులతో దస్తూరాబాద్‌ మండల కేంద్రంలో కరెంట్‌ స్తంభం విరిగిపోయి.. గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఖానాపూర్‌ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, బీబీపేట మండలాల రైతులు శుక్రవారం ఆయా ప్రాంతాల్లో రాస్తారోకో చేశారు. ఽఖమ్మం జిల్లా వైరా మండలంలో శుక్రవారం అకాల వర్షానికి రోడ్లు, కల్లాలపై ఆరబోసిన వందలాది బస్తాల వరి ధాన్యం తడిసిముద్దయింది. నారపనేనిపల్లి, సిరిపురం తదితర చోట్ల రోడ్లపక్కనున్న చెట్లు నేలకొరిగాయి. సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీలోని కొమ్ముగూడెం, బాసారం గ్రామాల్లోని 10 రేకుల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా, ఆదిలాబాద్‌ జిల్లా అర్లీలో శుక్రవారం 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్లగొండ జిల్లా బుగ్గబావిలో 41.9 ఉష్ణోగ్రత నమోదయ్యింది.

Updated Date - May 11 , 2024 | 06:39 AM