Share News

Metro Project: హైదరాబాద్‌ మెట్రోకు ఏడేళ్లు

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:27 AM

మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ విస్తరణ పనులకు నిధుల కొరత లేదని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. నిధుల విషయంలో ముఖ్యమంత్రి తమకు భరోసా ఇచ్చారని తెలిపారు.

Metro Project: హైదరాబాద్‌ మెట్రోకు ఏడేళ్లు

  • కేంద్ర అనుమతి రాగానే రెండో దశ షురూ

  • ఒకే సారి ఐదు కారిడార్ల నిర్మాణ పనులు

  • హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

  • ఏడాదిలోగా ఏడు కొత్త రైళ్లు : ఎల్‌ అండ్‌ టీ ఎండీ కేవీబీ రెడ్డి

  • ఘనంగా మెట్రో వార్షికోత్సవం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ విస్తరణ పనులకు నిధుల కొరత లేదని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. నిధుల విషయంలో ముఖ్యమంత్రి తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే రెండో దశ పనులను ఐదు కారిడార్లలో ఒకేసారి నిర్వహిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గురువారం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ మెట్రో ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో రైలు సర్వీ్‌సగా నిలుస్తోందని, ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం, ప్రజలు ఎంతో సహకరించారని గుర్తు చేశారు. రెండో దశ మెట్రో ప్రాజెక్టులో కిలోమీటరు నిర్మాణానికి రూ.318 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నామని తెలిపారు. భూగర్భ మార్గం నిర్మాణానికి కిలోమీటరుకు రూ.600 కోట్ల నుంచి రూ.1000 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ముంబై లాంటి నగరాల్లో ఈ ఖర్చు రూ.1500 కోట్లు దాకా ఉంటుందని, దానితో పోలిస్తే తాము తక్కువ ఖర్చుతోనే పనులు చేస్తున్నామని తెలిపారు. ఒక మెట్రో లైన్‌.7 బస్సు లైన్లు, 24 కారు లైన్లకు సమానమన్నారు. 20 ఏళ్లుగా ప్రతీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మెట్రో నిర్వహణకు సహకరిస్తూ వస్తున్నారని ఎన్వీఎస్‌ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


  • ఏడాదిలోగా 7 కొత్త రైళ్లు

ప్రయాణికుల సంఖ్య దృష్ట్యా ఏడాది లోపు 4 నుంచి 7 కొత్త రైళ్లను (మూడు కోచ్‌లతో) తీసుకొస్తామని ఎల్‌ అండ్‌ టీ ఎండీ కేవీబీ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఏడేళ్ల ప్రయాణంలో హైదరాబాద్‌ మెట్రో ఎన్నో మైలురాళ్లను చేరుకుందన్నారు. ఇప్పటిదాకా 44.2 మిలియన్‌ కిమీలు ప్రయాణించిన హైదరాబాద్‌ మెట్రో రైళ్లు 63.50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని తెలిపారు. హంకాంగ్‌, సింగపూర్‌, తర్వాత 99.9 శాతం విశ్వసనీయత కలిగిన అత్యుతమ మెట్రో హైదరాబాద్‌దే అని చెప్పారు. మెట్రో వల్ల ఇప్పటివరకు 184 మిలియన్‌ లీటర్ల ఇంధనం ఆదా అయిందని, నగరంలో 42.4 మిలియన్ల కిలోల కర్భన ఉద్గారాలు తగ్గాయని కేవీబీ రెడ్డి వివరించారు. కాగా, వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సంస్థ డిజిటల్‌ లోగోను ఆవిష్కరించారు. క్వాలిటీ రేటింగ్‌ సంస్థ ద్వారా మెట్రోకు వచ్చిన ఫైవ్‌ స్టార్‌ క్వాలిటీ సర్టిఫికెట్‌ను ఎన్వీఎస్‌ రెడ్డి, కేవీబీ రెడ్డి అందుకున్నారు.

Updated Date - Nov 29 , 2024 | 04:27 AM