Hyderabad: ఇక.. నాలాలూ ప్రైవేటుకే..!
ABN , Publish Date - Oct 18 , 2024 | 10:02 AM
రహదారుల తరహాలో నాలాలనూ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్‌ఎంపీ)తో నగరంలోని ప్రధాన రహదారుల పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగైందని, నాలాలనూ ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ముంపు సమస్యకు పరిష్కారం చూపవచ్చని యోచిస్తున్నారు.
- రహదారుల తరహాలో అప్పగించే యోచన
- పూడికతీయడంతో పాటు, వ్యర్థాలు వేయకుండా నియంత్రించే బాధ్యత ఏజెన్సీలకు
- వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు
- ముంపు ముప్పు తగ్గించేందుకే
- తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు
- సంక్లిష్ట ప్రాంతాల్లోని నాలాల అప్పగింత
- సత్ఫలితాలనిస్తే ఇతర ఏరియాల్లో కూడా అమలు
- కొత్త కమిషనర్ పరిశీలన అనంతరం సర్కారు ముందుకు..
వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు జీహెచ్‌ఎంసీ బహుముఖ వ్యూహాలు అమలు చేస్తోంది. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్‌డీపీ)లో భాగంగా డ్రైన్‌ల నిర్మాణం, నాలాల విస్తరణ చేపట్టిన సంస్థ.. ముంపు ప్రాంతాల్లో ముప్పు తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. రహదారుల తరహాలో నాలాల పూడికతీత బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని భావిస్తోంది.
హైదరాబాద్ సిటీ: రహదారుల తరహాలో నాలాలనూ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్‌ఎంపీ)తో నగరంలోని ప్రధాన రహదారుల పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగైందని, నాలాలనూ ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ముంపు సమస్యకు పరిష్కారం చూపవచ్చని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. జోన్ల వారీగా తీవ్ర ముంపునకు గురవుతున్న ప్రాంతాల పక్కనున్న, నిర్వహణ సంక్లిష్టంగా ఉన్న నాలాల వివరాలను కేంద్ర కార్యాలయం సేకరిస్తోంది. రోడ్లు, ఇతర ప్రాజెక్టుల మాదిరిగా నాలాల నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించే కార్యక్రమమూ హెచ్-సిటీలో భాగంగా భాగంగానే చేపట్టనున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నల్లా మీటర్ పనిచేయట్లే!
సీఆర్‌ఎంపీ ఇలా..
వర్షాకాలం వచ్చిందంటే గ్రేటర్‌లోని రహదారులపై ప్రయాణించడం పెద్ద సాహసమనే చెప్పాలి. అడుగడుగునా గుంతలు, కంకర తేలిన మార్గాలపై వాహనదారులు ప్రమాదాలకు గురవుతుంటారు. ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చించినా అదే దుస్థితి. గత ప్రభుత్వంలోని పెద్దలూ రోడ్ల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్(Hyderabad)లో రోడ్ల వల్ల సర్కారుకు చెడ్డ పేరు వస్తున్నదని బహిరంగంగా ప్రకటించారు. ఈ క్రమంలో ప్రివెంటీవ్ పీరియాడికల్ మెయింటెనెన్స్(పీపీఎం), ఇతరత్రా ప్రయోగాలు చేసినా ఫలితం కనిపించలేదు.
దీంతో ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు సీఆర్‌ఎంపీలో భాగంగా రూ.1,839 కోట్ల అంచనా వ్యయంతో 812 కి.మీల మేర రోడ్లను ఐదేళ్ల కాలవ్యవధికి ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. డిసెంబర్‌తో ఈ గడువు ముగియనుంది. జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉన్నప్పటితో పోలిస్తే ప్రైవేట్ సంస్థల నిర్వహణలో రహదారుల పరిస్థితి కొంత మెరుగైందన్న అభిప్రాయం నిపుణులూ వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరిన్ని రోడ్ల నిర్మాణం, నిర్వహణనూ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే అంశంపై కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో నాలాల విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా..
గ్రేటర్‌లో 370 కి.మీల మేర మేజర్ నాలాలున్నాయి. గతంలో కేవలం వర్షాకాలం ముందు చేపట్టే నాలాల పూడికతీతను నాలుగైదేళ్లుగా సీజన్‌తో సంబంధం లేకుండా చేపట్టి ఎప్పటికప్పుడు నాలాల్లో వ్యర్థాలు తొలగిస్తున్నారు. ఇందుకోసం ఏటా రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి వర్షం పడిందంటే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. సమీప బస్తీలు, కాలనీలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలాల పూడికతీత బాధ్యతలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే అంశాన్ని ఉన్నతస్థాయిలో పరిశీలిస్తున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలోనూ వ్యర్థాలు వేయడం వల్లే నాలాలు ఉప్పొంగుతున్నాయని అధికారులు గుర్తించారు.
పరుపులు, దిండ్లు, పాత బట్టలు, సామగ్రి వంటి వాటితోపాటు నిత్యం ఇళ్లలో వెలువడే చెత్తనూ వేస్తున్నారు. ఇవి వరద ప్రవాహానికి ప్రతిబంధకమవుతున్నాయి. అందుకే పూడికతీతతోపాటు వ్యర్థాలు వేయకుండా నియంత్రించే బాధ్యత ఆయా సంస్థలకు అప్పగించాలని భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని నాలాలను ఎంపిక చేసి ఏడాది కాల వ్యవధికి ఏజెన్సీలకు ఇస్తారు. సత్ఫలితాలనిస్తే దశల వారీగా ఇతర నాలాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం కిలోమీటర్‌కు ఖర్చు చేస్తోన్న మొత్తం ఆధారంగా.. ప్రయోగాత్మకంగా ఎన్ని కిలోమీటర్లు అప్పగించాలి, అందుకు ఎంత ఖర్చవుతుందన్నది అంచనా వేయనున్నారు. కొత్త కమిషనర్ వచ్చిన నేపథ్యంలో ఆయనతో చర్చించిన అనంతరం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఓ అధికారి తెలిపారు.
ఇదికూడా చదవండి: BJP: కిషన్‌రెడ్డిపై అనుచిత వీడియోలు తొలగించాలి
ఇదికూడా చదవండి: Vijay Babu: కేసీఆర్ వల్లే చిన్న లిఫ్టులు నిర్వీర్యం
ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు
ఇదికూడా చదవండి: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్
Read Latest Telangana News and National News