Share News

Hyderabad: ఇక.. చేతులనూ మార్చేస్తారు...

ABN , Publish Date - Nov 09 , 2024 | 10:02 AM

కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె మార్పిడి మాదిరిగా మున్ముందు చేతులు మార్పిడి కూడా జరగబోతోంది. బ్రెయిన్‌డెడ్‌(Brain dead) అయిన వారి చేతులను ప్రమాదాల్లో దివ్యాంగులుగా మారిన వారికి అమర్చడానికి అపోలో అస్పత్రి సిద్ధమవుతోంది. ఈ మేరకు మూడు నెలల క్రితం ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

Hyderabad: ఇక.. చేతులనూ మార్చేస్తారు...

- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అపోలో వైద్యులు

- అనుమతి రాగానే జీవన్‌దాన్‌ ద్వారా సేకరణ

- బ్రెయిన్‌డెడ్‌ అయిన వారివి సేకరించి ప్రమాదాల్లో దివ్యాంగులైన వారికి మార్చేందుకు సన్నాహాలు

- ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న నలుగురు

హైదరాబాద్‌ సిటీ: కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె మార్పిడి మాదిరిగా మున్ముందు చేతులు మార్పిడి కూడా జరగబోతోంది. బ్రెయిన్‌డెడ్‌(Brain dead) అయిన వారి చేతులను ప్రమాదాల్లో దివ్యాంగులుగా మారిన వారికి అమర్చడానికి అపోలో అస్పత్రి సిద్ధమవుతోంది. ఈ మేరకు మూడు నెలల క్రితం ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జీవన్‌దాన్‌ ద్వారా సేకరించి అవసరమైన వారికి మార్పిడి చేస్తామని ఆస్పత్రి సర్జన్‌ డాక్టర్‌ జీఎన్‌ బండారి తెలిపారు. దేశంలో ఇప్పటికి 36 మందికి చేతుల మార్పిడి జరిగిందని వివరించారు. చేతుల మార్పిడికి అపోలో ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులున్నారని చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చాయ్‌ నుంచి చికెన్‌65 వరకు.. 35% కల్తీయే..


ఆస్పత్రిలో ముగ్గురు ఒక చేతి మార్పిడి, మరొకరు రెండు చేతుల మార్పిడి కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే దాతల నుంచి సేకరించిన వాటితో వారికి మార్పిడి చేస్తామని వివరించారు. విరిగిన, పుట్టుకతో లోపాలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికత ద్వారా డోనర్‌ చేతులను అమర్చవచ్చన్నారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి చేతులను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వస్తే సేకరించి, ఆ చేతుల స్థానంలో వారికి కృత్రిమ చేతులను అమరుస్తామన్నారు.


చేతులు లేవనే భావన కుటుంబ సభ్యుల్లో కలగకుండా జాగ్రత్త పడతామన్నారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి వివరాలు తమకు అందగానే అవసరమైన వారిని వెంటనే ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించి సర్జరీకి సిద్ధం చేస్తామని, దాత నుంచి సేకరించిన చేతులను అవసరమైన వారికి అమరుస్తామని పేర్కొన్నారు. ఈ తరహా మార్పిడిలో మంచి ఫలితాలున్నాయని, సమ వయస్సు ఉన్న వారివి సేకరిస్తామని, లింగ భేదం లేకుండా చేతులను మార్పిడి చేస్తామన్నారు.


గోల్డెన్‌ అవర్‌లోనే..

చేతి పైభాగం రీప్లాంట్‌ చేయడానికి గోల్డెన్‌ అవర్‌ 4 నుంచి 6 గంటల సమయం ఉంటుందని డాక్టర్‌ జీఎన్‌ బండారి తెలిపారు. చేతి మునివేళ్లు, మణికట్టు కింద భాగాల రీప్లాంటేషన్‌కు గోల్డెన్‌ అవర్‌గా 6 నుంచి 8 గంటల సమయాన్ని చెప్పొచ్చన్నారు. ఈ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముక్కలుగా విడిపోయిన భాగాలను తిరిగి అమర్చవచ్చని చాలామందికి తెలియదన్నారు.


విడిపోయిన భాగాలను తీసుకెళ్లే పద్ధతులు తెలియకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పారు. విడిపోయిన భాగాలను నీటితో శుభ్రం చేసి పాలిథిన్‌ కవర్‌ లేదా అల్యూమినియం రేపర్‌లో ఉంచాలన్నారు. ఆ కవర్‌ను ఐస్‌ ప్యాక్‌లో ఉంచాలని తెలిపారు. కొందరు నేరుగా ఐస్‌లో ఉంచడం వల్ల ఫ్రాస్ట్‌ బైట్‌ గాయాలవుతాయన్నారు. వీటిని తిరిగి అమర్చడం సాధ్యం కాదన్నారు. రీ ఇంప్లాంటేషన్‌ విజయవంతం కావాలంటే క్షతగాత్రుడిని సరైన పద్ధతిలో ఆస్పత్రికి తరలించాలన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. ఆన్‌లైన్‌లోనే!

ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన

ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే

Read Latest Telangana News and National News

Updated Date - Nov 09 , 2024 | 10:02 AM