Hyderabad: బల్దియాలో దొంగలు పడ్డారు..!
ABN , Publish Date - Jun 15 , 2024 | 11:35 AM
జీహెచ్‌ఎంసీ(GHMC) కేంద్ర కార్యాలయంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలోని ఏసీల కాపర్ పైపులు, మరుగుదొడ్లలోని నల్లాలు, లైట్లు, కంప్యూటర్ల వద్ద స్పీకర్లు, కీబోర్డులు దొంగలించి అమ్ముకుంటున్నారు.
- ఫ్యాన్లు, నల్లాలు, ఏసీ కాపర్ వైర్లు చోరీ
- పాత ఫర్నిచర్, ఏసీలు కూడా
- వరుసగా జరుగుతున్న దొంగతనాలు
- అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు
- సెక్యురిటీ నిఘా అంతంతే
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC) కేంద్ర కార్యాలయంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలోని ఏసీల కాపర్ పైపులు, మరుగుదొడ్లలోని నల్లాలు, లైట్లు, కంప్యూటర్ల వద్ద స్పీకర్లు, కీబోర్డులు దొంగలించి అమ్ముకుంటున్నారు. కార్యాలయ ప్రాంగణంలో ఉంచిన పాత ఫర్నిచర్, ఏసీలూ చోరీకి గురైనట్టు ఓ అధికారి చెప్పారు. వాస్తవంగా పాత ఫర్నీచర్, ఇతర వస్తువులను వేలం వేసి అమ్మాల్సి ఉండగా.. సంబంధిత అధికారులు నెలల తరబడి పట్టించుకోకపోవడంతో దొంగల పాలయ్యాయి. కార్యాలయం చుట్టూ, ప్రతి అంతస్తులో సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పని చేయడం లేదు. ఇప్పటికే పలుమార్లు చోరీలు జరిగినా.. ఒక్కరినీ గుర్తించలేదు. దొంగతనాలకు సంబంధించి అధికారులు రెండు, మూడు పర్యాయాలు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అయినా చోరీలు ఆగకపోగా.. క్రమేణా పెరుగుతున్నాయి. సీసీ కెమెరాలతోపాటు 24 గంటలూ కార్యాలయంలో సెక్యూరిటీ ఉంటుంది. అయినా చోరీలు జరుగుతుండడం గమనార్హం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణంగా కార్యాలయ పని వేళలు. అయినప్పటికీ.. కొందరు అధికారులు సమావేశాలు, ఇతర పనుల కోసం రాత్రి ఏడెనిమిది గంటల వరకు, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం ఉంటారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఐసెట్ టాపర్లు మనోళ్లే..
అధికారులు, ఉద్యోగులు వెళ్లిన అనంతరం విభాగాల వారీగా, ప్రధాన గేట్లకు ఎక్కడికక్కడ తాళాలు వేయాలి. భవనంలోకి వెళ్లేందుకు మేయర్, కమిషనర్ వైపున్న ద్వారాలను, ప్రధాన గేట్లూ అర్ధరాత్రి 11, 12 గంటల వరకు తెరిచే ఉంచుతున్నారు. ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై ఓ వివాదానికి సంబంధించి కేసు నమోదు కాగా.. పోలీసులు జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం అధికారులను సీసీపుటేజీ అడిగారు.
సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఐటీ విభాగం చెప్పడంతో పోలీసులు తెల్ల మొహం వేశారు. కెమెరాలు పనిచేయకుంటే మీ సంస్థ లో జరిగే చోరీల బాధ్యులనూ ఎలా గుర్తిస్తామని ప్రశ్నించారు. రెండు, మూడేళ్లకోమారు కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తో న్న అధికారులు.. వాటి నిర్వహణకూ రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. అయినా అవి సక్రమంగా పని చేయకపోవడం గమనార్హం.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News