Hyderabad: ట్రాఫిక్ చక్రబంధం.. నడిరోడ్లపై నరకయాతన
ABN , Publish Date - May 17 , 2024 | 12:57 PM
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
- 20 కిలోమీటర్లు.. రెండున్నర గంటలు
- గంటలకొద్దీ ట్రాఫిక్ ఇక్కట్లు
- మెట్రోలో కిక్కిరిసిన ప్రయాణికులు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడుగు పెట్టే సందులేకుండా రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ కూడళ్ల వద్ద చక్రబంధంలా నాలుగు వైపులా వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. వెనక్కి తిరిగిపోలేక.. ముందుకు సాగలేక గంటలకొద్దీ రోడ్లపై నరకయాతన అనుభవించారు.
ట్రై కమిషనరేట్ పరిధిలో హయత్‌నగర్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ మలక్‌పేట(Hayatnagar, LBnagar, Dilsukhnagar Malakpet), చాదర్‌ఘాట్, కోఠి ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా బారులు తీరాయి. ఉప్పల్, రామంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, బేగంపేటలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. నాంపల్లి, మెహిదీపట్నం, ఆసి్‌ఫనగర్, మొజాంజాహి మార్కెట్, లక్డీకపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో అత్యధిక ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఇళ్లకు చేరుకునే క్రమంలో నరకయాతన అనుభవించారు. వాహనదారులంతా రోడ్లపై ఆగిపోయారు. 10 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన వాహనదారులు గంటన్నర నుంచి రెండున్నర గంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. జంక్షన్‌ల వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. కొన్నిచోట్ల పోలీసులు లోతట్టు ప్రాంతాల్లో రోడ్డుపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి ప్రయత్నించారు.
ఇదికూడా చదవండి: Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
ఐటీ కారిడార్ అతలాకుతలం..
గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ అతలాకుతలం అయింది. ఐటీ ఉద్యోగులు నరకం చూశారు. విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఐటీ ఉద్యోగుల వాహనాలు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చాయి. దాంతో గచ్చిబౌలి, బోటానికల్ గార్డెన్, రాయదుర్గం, నార్సింగి, తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐకియా, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలోని ఖాజాగూడ సిగ్నల్ వద్ద భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడ కేవలం ఇద్దరే ట్రాఫిక్ పోలీసులు ఉండటంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం కష్టంగా మారింది.. మరోవైపు మైహోం బూజా వైపు నంచి వచ్చే వాహనాలు కొండ మధ్యలోంచి వేసిన రోడ్డు మీదుగా వచ్చి రాయదుర్గం వద్ద కలవడంతో అటు గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. గచ్చిబౌలి నుంచి మియాపూర్ వెళ్లే ప్రాంతం వాహనదారులతో కిక్కిరిసిపోయింది. మియాపూర్ నుంచి చందానగర్‌వైపు, కూకట్‌పల్లి వైపు.. బాచుపల్లి వైపు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కిక్కిరిసిన మెట్రో..
ఇదిలా ఉండగా..గురువారం సాయంత్రం ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో బస్సుల్లో వెళ్లే వాహనదారులు మెట్రోను ఆశ్రయించారు. దాంతో సాయంత్రం 4.30 గంటలనుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిపోయాయి. కొంతమంది వాహనదారులు వాహనాలను కార్యాలయాల్లోనే ఉంచి దగ్గరలోని మెట్రో స్టేషన్‌ల వద్దకు చేరుకొని ప్రయాణించి ట్రాఫిక్ నరకం నుంచి తప్పించుకున్నారు.
ఇదికూడా చదవండి: Secunderabad: కంటోన్మెంట్‌లో క్రాస్ ఓటింగ్ భయం...
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News