Share News

TG : బీసీ కోటాకు మధ్యేమార్గం!

ABN , Publish Date - Aug 21 , 2024 | 02:32 AM

ఒకపక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు..

TG : బీసీ కోటాకు మధ్యేమార్గం!

  • చట్ట ప్రకారం 23 శాతం.. పార్టీపరంగా 19 శాతం

  • హామీ నిలబెట్టుకోవడానికి, సుప్రీం తీర్పు అమలుకు ఇదే మార్గం

  • స్థానిక ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వ యోచన

  • తాము పాటిస్తూ ఇతర పార్టీలను సవాల్‌ చేయాలన్న ఉద్దేశం

  • మెుత్తం కోట 50 శాతం.. అందులో బీసీలకు 23 శాతం

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఒకపక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు.. వాటినుంచి బయటపడి.. రెండూ నెరవేరేలా మధ్యే మార్గాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

బీసీలకు గతంలోలాగానే చట్టపరంగా 23 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ.. మరో 19 శాతం కాంగ్రెస్‌ పార్టీపరంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్‌ పూర్తవుతుందని.. మొత్తం రిజర్వేషన్లు (బీసీ, ఎస్సీ, ఎస్టీ) 50 శాతానికి మించకూడదనే సుప్రీం కోర్టు నిబంధనను కూడా పాటించినట్లవుతుందని యోచిస్తోంది.

ఇతర పార్టీలను కూడా ఇదే పద్ధతిలో బీసీలకు సీట్లు కేటాయింలాని డిమాండ్‌ చేసి పైచేయి సాధించవచ్చని అంచనా వేస్తోంది. బీసీ ఓటర్ల గణన చేసినా, కులాల వారీ గణన చేపట్టినా ఫంచాయతీ ఎన్నికలకు ఇదే విధానాన్ని అనుసరించాలనే వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.


కాగా, బీసీ కుల గణన చేసి, రిజర్వేషన్లను అమలు చేసేందుకు కొన్ని పీటముడులున్నాయి. బీసీ ఓటర్ల గణన చేస్తే రెండు నెలల్లో కసరత్తు పూర్తి చేయొచ్చు. కులాలవారీ గణనకు కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏడాది చివరికల్లా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటోంది. ఆలస్యమైతే ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు సమస్య వస్తుంది.

ప్రత్యేకాధికారుల పాలన వల్ల గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతాయి. అయితే, కుల గణన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ పలుసార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ అమలు ఎలాగనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

బీసీ ఓటర్ల గణన ఒక మార్గం..

కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. దానిప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు కుల గణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42 శాతానికి పెంచుతామని పేర్కొంది.

కాగా, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే, అవి కోర్టులో నిలవవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా, బిహార్‌ ప్రభుత్వం రెండేళ్ల కిందట బీసీలకు 54 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల జరపాలనుకుంది. దీనిని పాట్నా హైకోర్టు తప్పుబట్టి.. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని స్పష్టం చేసింది. చివరకు 50 శాతానికి పరిమితమై ఎన్నికలు నిర్వహించిన సంగతిని ఉదహరిస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రస్తుతానికి బీసీ ఓటర్ల జాబితా తయారుచేసి.. దాని ప్రకారం రాజ్యాంగం నిర్ణయించిన పరిమితి లోబడి ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని చెబుతున్నారు.

బీసీ ఓటర్ల శాతం నిర్ధారణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రామాణిక ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకోవాలి. దాని ఆధారంగా సర్వే చేసి ఓటర్ల జాబితాను బీసీ కమిషన్‌కు అందజేయాలి. కమిషన్‌ ఆ జాబితా మేరకు బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ణయిస్తుంది.


సుప్రీం తీర్పు ప్రకారం పూర్తిస్థాయి ప్రత్యేక (డెడికేటెడ్‌) కమిషన్‌ నిర్ణయించిన రిజర్వేషన్లు మాత్రమే చెల్లుతాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయిస్తే చెల్లుబాటు కావని, రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు మినహా మిగతావన్నీ జనరల్‌ విభాగం కిందకే వస్తాయని అంటున్నారు.

బీసీ కమిషన్‌ బీసీలకు రిజర్వేషన్‌ నిర్ధారించేటపుడు ఎస్సీ, ఎస్టీల కోటా పోను మిగతా శాతాన్ని కలుపుకుంటే 50 శాతం మించొద్దనే నిబంధన ఉంది. ఈ ప్రకారం ఎన్నికలకు వెళ్తే మొత్తం వ్యవహారాన్ని రెండు నెలల్లో పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో కులగణన చేసినా సుప్రీం నిర్దేశించిన ట్రిపుల్‌ టి నిబంధన పాటించినట్లే అవుతుంది.


కులాల వారీ గణనకు ఎక్కువ సమయం

బీసీ ఓటర్ల సర్వేకు బదులు కులాల వారీగా సర్వే చేయాలనుకుంటే.. చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సర్వేలో బీసీలే కాకుండా అన్ని కులాల వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దాంతోనే అసలు లెక్కలు తేలుతాయని బీసీ సంఘాల డిమాండ్‌గా ఉంది.

న్యాయ చిక్కులు లేకుండా ఈ పద్ధతిలో వ్యవహారాన్ని పూర్తి చేయాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. జనాభా లెక్కల అధికారుల పర్యవేక్షణలో సుశిక్షితులైన ఎన్యుమలేటర్లతో సర్వే చేయించాల్సి ఉంటుంది.

సాధారణంగా ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది ఎన్యుమరేటర్లుగా ఉంటారు. ఇతర సిబ్బందికి సర్వేలో తగినంత అనుభవం ఉండదు. సెలవుల్లో తప్ప సాధారణ రోజుల్లో సర్వే సాధ్యమా అన్న సందేహం వ్యక్తం అవుతోంది.


ఈ సర్వే అన్ని కులాల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో ఉన్న అసమానతలను అంచనా వేస్తుంది. వచ్చిన డేటాను పూర్తిగా విశ్లేషించి, ఒక నిర్ధారణకు వచ్చి సమగ్ర నివేదికను ప్రకటించాలంటే సమయం పడుతుంది. డేటాను క్షేత్ర స్థాయిలో పరిశీలించుకోవాల్సి ఉంటుంది.

యుద్ధప్రాతిపదికన చేసినా 6 నెలలు పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లో దేన్ని చేపట్టినా 50 శాతం పరిమితి ఉండనే ఉంది. అందుకే ఏ పద్ధతిలో సర్వే చేసినా ప్రస్తుతానికి 23 శాతం అమలు పరుస్తూ మిగిలిన 19 శాతాన్ని పార్టీపరంగా కేటాయించడం మంచిదని సర్కారు భావిస్తోంది.

Updated Date - Aug 21 , 2024 | 02:33 AM