Hyderabad : వైద్య శాఖ బదిలీల్లోనే ఎందుకిలా?
ABN , Publish Date - Jul 22 , 2024 | 05:43 AM
వైద్య ఆరోగ్య శాఖలోని సాధారణ బదిలీల్లో గందరగోళంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. బదిలీలపై నర్సులు ఆందోళన చేయడం, సంఘాల పేరిట లేఖలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది.
ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయ్?
సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉన్నారు!
ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వండి.. సీఎం ఆదేశం
వసూళ్ల పర్వంపై రంగంలోకి ఇంటెలిజెన్స్!
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలోని సాధారణ బదిలీల్లో గందరగోళంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. బదిలీలపై నర్సులు ఆందోళన చేయడం, సంఘాల పేరిట లేఖలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది. వైద్య శాఖలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొన్నదో తెలుసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. బదిలీల వ్యవహారంపై సమగ్ర నివేదిక కోరినట్లు తెలిసింది.
సాధారణ బదిలీ ప్రక్రియలో ఏ శాఖలో లేని ఆందోళనలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయని రేవంత్ ఆరా తీసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వైద్య శాఖ బదిలీల తీరు సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సకాలంలో ప్రక్రియ పూర్తి చేయకపోవడం వల్ల బదిలీల తేదీలను పెంచడానికి వైద్యశాఖే కారణమైందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
తేదీలను పెంచడంతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొందరు కోర్టుకు వెళ్లి బదిలీలపై స్టే తెచ్చుకుంటున్నారని ఓ ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజారోగ్య విభాగంలో జరిగిన బదిలీలపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్టాఫ్‌నర్స్ సీనియారిటీ జాబితాను నాలుగుసార్లు మార్చినా, తప్పులు దొర్లాయని నర్సులు చెబుతున్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, లేకుంటే కాంగ్రెస్ సర్కారుకు ఇది మచ్చలా మారుతుందని సీనియర్లు పేర్కొంటున్నారు. మరోవైపు యూనియన్ల పేరిట అప్పటికప్పుడు లేఖలు తెచ్చుకొని తమ స్థానాలను కాపాడుకుంటున్న ఉద్యోగులపై ఇతర ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజీవో, టీఎన్‌జీవో, ఐఎన్‌టీయూసీ సంఘాలు తమకు గుర్తింపు ఉందని ఎడాపెడా లేఖలు ఇచ్చాయి. కొందరు ఈ లేఖల ముసుగులో పెద్దయెత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సర్కారు ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. డబ్బులు ఎలా వసూలు చేశారన్న దానిపై ఇప్పటికే కొందరిని విచారించినట్లు సమాచారం.