Hyderabad: తలాక్ ఇవ్వనందుకు యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:54 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి తలాక్ ఇవ్వనని అన్నందుకు ఓ యువకుడిని యువతి సోదరుడు దారుణంగా హత్య చేశాడు. కత్తితో మెడపై పొడిచి, సర్జికల్ బ్లేడ్లతో శరీరంపై కోసి కిరాతకంగా హతమార్చాడు.
పోలీసుల అదుపులో యువతి సోదరుడు
ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఘటన
బోయిన్‌పల్లి, డిసెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి తలాక్ ఇవ్వనని అన్నందుకు ఓ యువకుడిని యువతి సోదరుడు దారుణంగా హత్య చేశాడు. కత్తితో మెడపై పొడిచి, సర్జికల్ బ్లేడ్లతో శరీరంపై కోసి కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో నివాసం ఉండే మహ్మద్ సమీర్ (21) అదే ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. సమీర్ వెల్డింగ్ పనులు చేస్తుండగా యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వారి పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఆరు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఇటీవల ఇంటికి తిరిగొచ్చిన దంపతులను అమ్మాయి కుటుంబసభ్యులు కలుసుకుని సంప్రదాయం ప్రకారం వివాహ చేస్తామని నమ్మించి యువతిని వారింటికి తీసుకెళ్లారు.
అనంతరం సమీర్‌ను సంప్రదించి యువతికి తలాక్ ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. అయితే దీనికి సమీర్ ఒప్పుకోలేదు. దాంతో అతనిపై కోపం పెంచుకున్న యువతి సోదరుడు ఉమర్ మరో నలుగురితో కలిసి శనివారం అర్ధరాత్రి కత్తులు, బ్లేడ్లతో సమీర్‌పై దాడికి తెగబడ్డాడు. కత్తితో మెడపై పొడిచి, సర్జికల్ బ్లేడ్లతో శరీరంపై కోసి సమీర్‌ను కిరాతకంగా హతమార్చాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సమీర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. యువతి సోదరుడు ఉమర్ నిజామాబాద్ పారిపోయాడని తెలుసుకుని అక్కడి పోలీసులకు సమాచారమివ్వగా వారు అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోస్టుమార్టం అనంతరం పోలీసులు సమీర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.