Zika virus: ‘జికా’ వస్తోంది తస్మాత్ జాగ్రత్త!
ABN , Publish Date - Jul 04 , 2024 | 11:52 AM
పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో జికా వైరస్(Zika virus) విజృంభిస్తోంది. రెండు రోజుల క్రితం పుణెలో ఒక్క రోజే ఆరు జికా వైరస్ వ్యాధి (జడ్‌వీడీ) కేసులు నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
- రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
- మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులతో ఆందోళన
- సంసిద్ధంగాలేని తెలంగాణ వైద్యశాఖ
- కనీస చర్యలూ తీసుకోని వైనం
- ఇప్పటికే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల విజృంభణ
హైదరాబాద్: పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో జికా వైరస్(Zika virus) విజృంభిస్తోంది. రెండు రోజుల క్రితం పుణెలో ఒక్క రోజే ఆరు జికా వైరస్ వ్యాధి (జడ్‌వీడీ) కేసులు నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎ్‌స) డాక్టర్ అతుల్‌గోయల్ అడ్వైయిజరీ జారీ చేశారు. జికాపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గర్భిణులను స్ర్కీనింగ్ చేయాలని కేంద్రం కోరింది. జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గర్భిణుల్లో పిండం ఎదుగుదలను పర్యవేక్షించాలని సూచించింది. ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని, ఆ అధికారి జికా వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమల పెరుగుదల నివారణకు చర్యలు చేపట్టాలని కోరింది. జికా కేసులు నమోదైతే వెంటనే నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీవీబీడీసీ)కు రిపోర్టు చేయాలని, అనుమానిత నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలని సూచించింది. అలా గే ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని వైరస్ పరిశోధనా కేంద్రాలకు కూడా శాంపిళ్లను పంపాలని ఆదేశించింది.
ఇదికూడా చదవండి: Chandra Bose: ‘మాటిచ్చా.. సరస్వతి గుడిని నిర్మించా’
అప్రమత్తంగాలేని రాష్ట్ర వైద్యశాఖ..
మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రోజూ వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు వాటిని నియంత్రించే బాధ్యత క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య సంచాలకులకే ఉంటుంది. అయితే మన వద్ద ఇంతవరకు అందుకు సంబంధించిన కార్యాచరణేమీ కానరావడంలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల విజృంభణ మొదలైంది. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగ్యూ మరణాలు కూడా సంభవించాయి. పటిష్ట పర్యవేక్షణ లేకపోవడం తో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన ఉన్న విభాగాధిపతి లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అందుకే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దోమల ద్వారా వ్యాప్తి..
జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే ఫ్లేవి వైరస్. జికా ప్రధానంగా ఏడెస్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇదే దోమ కుడితే డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వైర్‌సలు కూడా సోకుతాయి. జికా సోకితే సాధారణ లక్షణాలే ఉంటాయి. ఇవి 2-7 రోజులపాటు కనిపిస్తాయి. ముఖ్యంగా జ్వరం, దద్దుర్లు, కీళ్ల నొప్పి, కండ్లకలక (ఎరుపు కళ్లు), కండరాలు, తలనొప్పితోపాటు మరికొన్ని తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. మైక్రోసెఫాలీ (పుట్టుక లోపం), గులియన్ బారే సిండ్రోమ్ (న్యూరోలాజికల్ డిజార్డర్), మెనింజైటిస్ (మెదడు, వెన్నెముక లైనింగ్ వాపు)లాంటి వాటికి కారణమౌతుంది.
నివారణ ఎలాగంటే..
దోమల వృద్ధిని నివారించడానికి ఇళ్లు, బహిరంగ ప్రదేశాల చుట్టూ నిలిచిన నీటిని తొలగించాలి. జికా కూడా లైంగికంగా సంక్రమించే అవకాశం ఉన్నందున సురక్షితమైన విధానాలను పాటించాలి. జికాకు నిర్దిష్ట చికిత్స లేదు, కానీ లక్షణాల ఆధారంగా చికిత్సను అందిస్తారు. జికా లక్షణాలు కనిపిస్తే వెంటనే సరైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని డాక్టర్‌ను సంప్రదించాలి.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News