Share News

Akunuri Murali: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆకునూరి మురళీ ఏం చెప్పారంటే?

ABN , Publish Date - Jul 19 , 2024 | 10:07 PM

మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ(Akunuri Murali) ఆధ్వర్యంలోని 10మంది ప్రొఫెసర్ల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సచివాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి పలు కీలక అంశాలపై వారు సీఎంతో చర్చించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద మురళీ మీడియాతో మాట్లాడారు.

Akunuri Murali: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆకునూరి మురళీ ఏం చెప్పారంటే?
former IAS officer Akunuri Murali

హైదరాబాద్: మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ(Akunuri Murali) ఆధ్వర్యంలోని 10మంది ప్రొఫెసర్ల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సచివాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి పలు కీలక అంశాలపై వారు సీఎంతో చర్చించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద మురళీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎంతో చర్చించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 33అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీ మాట్లాడుతూ.."దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 15నుంచి 28శాతం వరకు బడ్జెట్‌లో విద్యకు కేటాయిస్తున్నారు. తెలంగాణలో కేవలం ఇది 5శాతంగా మాత్రమే ఉంది. ఇక నుంచి విద్యకు బడ్జెట్‌లో 15శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన దీనిపై సానుకూలంగా స్పదించారు. కచ్చితంగా 15శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చెయ్యబోతున్నామని సీఎం చెప్పడం చాల సంతోషం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని కోరాం. ఇది చాల మంచి పాలసీ అని కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.


అంగన్వాడీ సెంటర్లల్లో సరైన విద్యా విధానం లేదని గుర్తించాం. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. మంచి టీచర్లను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 74శాతం నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే నియామకాలు చేపడతామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. గత పదేళ్లలో యూనివర్శిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ఎడ్యుకేషన్ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని సీఎంని కోరాం. 10 రోజులకోసారి ఎడ్యుకేషన్‌పై రివ్యూ చెయ్యాలని చెప్పాం. దీనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో విద్యపై ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వమని చెప్పారు. దాన్ని త్వరలోనే తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తాం" అని వెల్లడించారు.

Updated Date - Jul 19 , 2024 | 10:09 PM