Share News

Pushspa 2 Movie: సంధ్య థియేటర్‌కు మరోసారి అల్లు అర్జున్.. ఎందుకంటే

ABN , Publish Date - Dec 24 , 2024 | 10:42 AM

సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు మరోసారి సంధ్య థియేటర్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరైన ఆయనను సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Pushspa 2 Movie: సంధ్య థియేటర్‌కు మరోసారి అల్లు అర్జున్.. ఎందుకంటే
Allu Arjun

పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ ఇవాళ మరోసారి సంధ్య థియేటర్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మాత్రం ఆయన వెళ్లేది సినిమా చూడటానికి కాదు. సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోమవారం బన్నికి ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. దాదాపు పది అంశాలపై పోలీసులు అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తనకు సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిందనే విషయాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని, తరువాత రోజు మాత్రమే విషయం తెలిసిందన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్‌కు ఎసీపీ సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహారించారని శాసనసభ వేదికగా వెల్లడించారు. దీంతో మీడియా సమావేశంలో అల్లు అర్జున్ ఆరోపణలపైనా ఇవాళ విచారించే అవకాశం ఉంది.


ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తన న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ బయలుదేరారు. విచారణలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ను తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.


చిక్కడపల్లి పీఎస్‌కు..

పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరారు. సంధ్య థియేటర్‌లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పోలీసులు మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ నటుడు అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఎ11గా పేర్కొన్నారు. పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఈలోపు హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. తాజాగా కేసు విచారణ కోసం పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనడంతో.. అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపారు. చివరకు ఇవాళ విచారణకు హాజరుకావాలని డిసైడ్ అయి.. స్టేషన్‌కు బయలుదేరారు. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ విచారణకు సహకరించాలని చెప్పడంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు లీగల్ టీమ్ కూడా వెళ్లింది. ఓ వైపు సంధ్య థియేటర్ ఘటనలో మహిళ చనిపోయిన విషయాన్ని ముందుగానే పోలీసులు అల్లు అర్జున్‌కు చెప్పారని ప్రభుత్వం చెబుతుండగా.. తనకు తరువాతి రోజు మహిళ మృతి చెందిందనే విషయం తెలిసిందని బన్ని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు విచారణలో ఏయే ప్రశ్నలు అడగనున్నారనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 24 , 2024 | 10:42 AM