TG Govt: నిమజ్జనం వేళ వైద్యారోగ్య శాఖ అప్రమత్తం.. ఆరోగ్య శిబిరాలు, అంబులెన్స్‌ల ఏర్పాటు
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:38 PM
లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య చికిత్స అవసరమున్నవారికి అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ.. అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య చికిత్స అవసరమున్నవారికి అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ.. అధికారులను ఆదేశించారు. అందుకుతగ్గట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. "నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలి" అని దామోదర సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో ముందస్తుగా 30 చోట్ల హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.
అప్రమత్తంగా ఉండండి..
రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌కు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు, పర్యాటకులకు అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందుకు తగ్గట్లు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. వైద్య అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి చేరుకునే వారికి సత్వర వైద్యాన్ని అందించేందుకు సమాయత్తం అయ్యారు.
నిమజ్జనానికి గణనాథుడు సిద్ధం..
పది రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) నిమజ్జనానికి సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్రల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహా గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. ఈరోజు బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు.
అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ట్యాంక్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మెుత్తంగా 31 క్రేన్లు ఉన్నాయి. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగుతుంది.
For Latest News and National News click here