Bada Ganesh: ఆఖరిరోజు క్యూ కట్టిన భక్తులు..
ABN , Publish Date - Sep 15 , 2024 | 12:46 PM
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గంటకు సరాసరి మూడు నుంచి ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత..
ఖైరతాబాద్ బడా గణేష్ దర్మనానికి భక్తులు క్యూ కట్టారు. ఆఖరి రోజుకు తోడు ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ వినాయకుడి నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ.. రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించరు. ఈరోజు (ఆదివారం) మాత్రమే దర్శనానికి అవకాశం ఉండటంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఖైరతాబాద్‌కు తరలివస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఖైరతాబాద్ భక్త జనసంద్రంగా మారింది. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ సన్నిదిలో శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. బడా గణేష్ దర్మానానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, లక్డీకపూల్, మెట్రోస్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్, ఐమాక్స్, లక్డీకపూల్ మార్గాల్లో గణేష్ దర్శనానికి భక్తులు వస్తున్నారు. అతిపెద్ద వినాయకుడు కావడంతో స్వామివారిని చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు దర్శనానికి క్యూలైన్‌లో 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.
ఫోన్‌లలో ఫోటోలు
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గంటకు సరాసరి మూడు నుంచి ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని ఫోన్లలో ఫోటోలు తీస్తుండటంతో క్యూలైన్‌లో భక్తుల దర్శనానికి ఆలస్యమవుతోంది. చిన్న పిల్లలతో దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు లేకపోవడంతో వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది.
నిమజ్జనం ఇలా..
ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం సెప్టెంబర్ 17 మంగళవారం జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలలోపు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.ఉదయం 6.30 గంటల వరకు పూజలు ముగించుకుని, నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు తెలిపారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తయ్యేలా చూస్తామన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here