Big Twist: రోజుకు రూ.2 లక్షలకుపైగా అతని సంపాదన..
ABN , Publish Date - Dec 12 , 2024 | 01:48 PM
నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీ చిక్కిన నిఖేష్ కుమార్.. రోజుకు రూ. 2 లక్షలకుపైగా సంపాదించాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలంలోనే అడ్డగోలుగా సంపాదించాడు. నిఖేష్ కుమార్‌తోపాటు అతని సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17 కోట్ల 73 లక్షల అక్రమాస్తులు వెలుగుచూశాయి.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో (Illegal Assets Case) అరస్టయి జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నిఖేస్ కుమార్ (AEE Nikesh Kumar)ను ఏసీబీ (ACB)తన కస్టడీలోకి (Custody) తీసుకుంది. కోర్టు ఆదేశాలతో నాలుగు రోజులపాటు విచారించనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైల్లో అతనిని గురువారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రూ. 5 వందల కోట్లకుపైగా అక్రమాస్తులు కూడపెట్టారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. నిఖేష్ బినామీ అస్తులపై కూడా అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీ చిక్కిన నిఖేష్ కుమార్.. రోజుకు రూ. 2 లక్షలకుపైగా సంపాదించాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది కాలంలోనే అడ్డగోలుగా సంపాదించాడు. నిఖేష్ కుమార్‌తోపాటు అతని సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17 కోట్ల 73 లక్షల అక్రమాస్తులు వెలుగుచూశాయి. ఒక లాకర్‌లో కిలోన్నర బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. వాటన్నింటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. వంద కోట్లపైనే ఉంటుందని అందచా వేస్తున్నారు.
నిఖేష్ కుమార్ ఉద్యోగంలో చేరి పదేళ్లవుతోంది. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగటున రోజుకు రూ.2 లక్షలకు తక్కువ కాకుండానే ఉన్నట్లు తేలుతోంది. ఇంత భారీగా కూడబెట్టేందుకు నిఖేశ్‌కుమార్ ఎలాంటి కుయుక్తులకు పాల్పడ్డాడనేది తేల్చేపనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా అనే విషయాన్నీ తేల్చే ప్రయత్నంలో ఉన్నారు.
నిఖేష్ కుమార్ పదేళ్ల క్రితమే ఉద్యోగంలో చేరినా... గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ఇంతింతై.. పెరిగినట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో చేరిన నిఖేశ్‌కుమార్ తొలుత వరంగల్ జిల్లాలో పనిచేసి... తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు తెలుస్తోంది. నాలాలు, జలాశయాల పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు. వాస్తవానికి క్లియరన్సీ సర్టిఫికేట్ జారీ చేసే అథారిటీ ఏఈఈ కాకపోయినా... ఆయా దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేయడంతోపాటు ఉన్నతాధికారుల తరఫున వాటాలనూ సేకరించి, ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. ఎవరైనా ఉన్నతాధికారులకు లేదంటే నేతలకు నిఖేశ్‌కుమార్ బినామీగా వ్యవహరించాడా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
రూ. 50 లక్షల వరకూ వసూలు..
నిఖేశ్‌కుమార్ పేరుకే గండిపేట ఏఈఈగా పనిచేసినా హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల్లోని రికార్డులను డీల్ చేసేవాడని తెలుస్తోంది. అతడి ద్వారా దస్త్రం పంపిస్తే వెనక్కి వచ్చేదే కాదని చెబుతున్నారు. ఉన్నతాధికారులను నయానా బయానా ఒప్పించడంలో నిఖేశ్ దిట్టగా పేరొందాడు. ఈక్రమంలో కొన్ని కీలక ఫైళ్లను క్లియర్ చేసేందుకు రూ. 50 లక్షల వరకూ వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంచాడనే ఆరోపణలున్నాయి. జలాశయాల పరిధిలోని బఫర్, ఎఫ్‌టీఎల్‌ల్లో నిర్మాణాలకు నిఖేశ్ సులభంగా అనుమతులను ఇప్పించడంతో బడావ్యాపారులు ఎంత మొత్తమైనా ముట్టజెప్పేందుకు వెనకాడేవారు కాదని చెబుతున్నారు. విలువైన స్థలమంతా అప్పనంగా వచ్చేస్తుండటంతోనే వ్యాపారులు అలా ముందుకొచ్చేవారని తెలుస్తోంది.
ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపైనా ఆరా
గండిపేట ఏఈఈగా నిఖేశ్‌కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే బడా బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో భారీ నిర్మాణాల కోసం వారు పెద్దమొత్తంలో లంచాలు ఇచ్చి ఉంటారనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దరఖాస్తుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ఉన్నతాధికారులకూ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం
ఎందుకు రాజీనామా చేశానంటే..: అవంతి శ్రీనివాస్
ప్రేమ కోసం మతం మార్చుకున్నా.. అయినా..
ప్రపంచ రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News