Hyderabad: పేర్లు మార్చుకుంటూ.. సీబీఐనే ఆటాడించాడు.. కానీ 20 ఏళ్ల తర్వాత..
ABN , Publish Date - Aug 05 , 2024 | 09:29 PM
బ్యాంకు మోసానికి పాల్పడి రెండు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ఆర్థిక నేరగాడిని సీబీఐ అధికారులు 22 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా నిందితుడి కోసం అధికారులు గాలిస్తుండగా.. తప్పించుకు తిరుగుతూ.. సీబీఐ అధికారులనే దేశమంతా తిప్పాడు.
బ్యాంకు మోసానికి పాల్పడి రెండు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ఆర్థిక నేరగాడిని సీబీఐ అధికారులు 22 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా నిందితుడి కోసం అధికారులు గాలిస్తుండగా.. తప్పించుకు తిరుగుతూ.. సీబీఐ అధికారులనే దేశమంతా తిప్పాడు. చివరికి తమిళనాడులోని తిరునల్వేలిలో ఆర్థిక మోసగాడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని సీబీఐ కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. ఈనెల 16వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. తరచూ తన పేర్లను మార్చుకుంటూ నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించి చట్టం నుంచి తప్పించుకుంటున్న వి చలపతిరావును తమిళనాడులో 20 సంవత్సరాల తర్వాత సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బ్యాంక్ మోసానికి పాల్పడిన చలపతిరావు తప్పించుకుని ఆధ్యాత్మిక గురువు ముసుగులో జీవనం సాగిస్తున్నాడు. బ్యాంక్ మోసాల ద్వారా రూ. 50 లక్షలు స్వాహా చేసిన చలపతిరావు, ఎప్పటికప్పుడు నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి తప్పించుకు తిరుగుతున్న చలపతిరావు ఇప్పటికే రెండు వివాహలు చేసుకున్నాడు. దేశం విడిచి పారిపోవడానికి ముందు ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
2002లో కేసు..
బ్యాంకులను మోసం చేసిన కేసులో చలపతిరావుపై 2002లో సీబీఐ కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్‌ను మోసగించిన చలపతిరావు బాబాగా అవతారం ఎత్తాడు. రాజస్థాన్ లో విదితామానంద తీర్థ స్వామీజీగా అవతారం ఎత్తిన చలపతిరావు.. వినీత్ కుమార్ గా చలామణి అవుతూ వచ్చాడు. తమిళనాడు, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్‌లో బాబాగా తిరుగుతున్న చలపతిరావు.. తన పేరు, తన ఇద్దరు భార్యల పేర్లతోపాటు ఈమెయిల్స్ సెల్ ఫోన్ నెంబర్ మార్చి బాబాగా అవతారం ఎత్తాడు. 2004 నుండి కనిపించకుండా పారిపోయిన చలపతిరావు.. 7 సంవత్సరాలు తర్వాత చనిపోయినట్లుగా భార్య కోర్టులో పిటిషన్ వేసింది. తన భర్త పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం తన పేరు మీద బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొంది. భార్య పిటిషన్‌తో విచారణను ప్రారంభించిన CBI అధికారులు.. తమిళనాడులోని ఒక గ్రామం నుండి బాబా అలియాస్ చలపతిరావును అరెస్ట్ చేశారు.
పేర్లు, ఊర్లు మారుస్తూ..
చలపతిరావు 2007లో తన పేరును వినీత్ కుమార్‌గా మార్చుకుని ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆచూకీ కనిపెట్టిన సీబీఐ అధికారులు అతడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసేలోపు తప్పించుకు పారిపోయాడు. 2014లో తమిళనాడులోని సేలం నుంచి భోపాల్‌కు చేరుకుని లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు వెళ్లి అక్కడ స్కూల్‌లో పనిచేశాడు. అతడి ఆచూకీ కనిపెడుతూ 2016లో సీబీఐ బృందం రుద్రాపూర్ చేరుకోవడంతో చలపతిరావు అక్కడి నుంచి పరారయ్యాడు. ఐడీలు, సిమ్ కార్డులు, మెయిల్ అడ్రస్‌లు తరచూ మారుస్తూ చలపతిరావు సీబీఐ అధికారులతో ఓ ఆటాడుకున్నాడు. చలపతిరావు రాజస్థాన్‌లో ఓ ఆశ్రమంలో చేరి అక్కడ బాబా అవతారం ఎత్తాడు. ఈ ఏడాది జులై8 వరకు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఉన్న మోసగాడు అక్డకి నుంచి తమిళనాడులోని తిరునల్వేలికి చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న సీబీఐ అధికారులు రెండు దశాబ్ధాల ప్రయత్నాల తర్వాత చలపతిరావును అరెస్ట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest News Click Here