CM Revanth: నేను సీఎం కావడానికి కారణమిదే.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 04 , 2024 | 08:52 PM
ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం ప్రచారం కోసం కాదని, లక్షలాది మంది నిరుద్యోగులకు విశ్వాసం, నమ్మకం కల్పించడానికి చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్: ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం ప్రచారం కోసం కాదని, లక్షలాది మంది నిరుద్యోగులకు విశ్వాసం, నమ్మకం కల్పించడానికి చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఈ కార్యక్రమం నిరుద్యోగ యవతకు స్ఫూర్తిని ఇచ్చేందుకు, ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసా ఇచ్చేందుకు చేపడుతున్నామని ఆయన పునరుద్ఘాటించారు. మా ప్రభుత్వం వచ్చింది.. మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం నిరుద్యోగులకు కల్పించడానికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. నూతనంగా నియమితులైన 543 డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, 1,463 జూనియర్ కళాశాలల లెక్చరర్లు, 2,632 టీజీటీ ఉపాధ్యాయులు, 479 మంది కానిస్టేబుల్స్, 75 మంది వైద్య సిబ్బందికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్‌బీ స్టేడియం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని, ఇదే ఎల్బీ స్టేడియంలో 2004లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు, రైతులపై ఉన్న అక్రమ కేసులు, విద్యుత్ బకాయిలు రద్దు చేస్తూ మొదటి సంతకం చేసి మన ప్రాంతంలో రైతును రాజును చేసేందుకు పునాది వేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
2023, డిసెంబరు 7వ తేదీన కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో మరోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిందని, అభయహస్తం పేరిట ఆరు గ్యారెంటీల అమలుకు తాను సంతకం చేశానని ముఖ్యమంత్రి తెలిపారు. మూడు నెలల కాలంలోనే ఈ స్టేడియంలోనే 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంతకాలు పెట్టామన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడిందని, కొందరు ఆత్మబలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ సాధించారని, తమ ఆత్మ బలిదానాలతో తమ భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు వస్తాయని అమర వీరులు నమ్మారని ముఖ్యమంత్రి అన్నారు.
ఆ బలిదానాలతో సాధించిన తెలంగాణలో నాటి ప్రభుత్వం అమరుల స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సింది పోయి, వాళ్ల లాభార్జన, వారి ధనదాహం తీర్చుకోవడానికే పని చేశారని విమర్శించారు. ఫాంహౌస్ మత్తులో గత పాలకులు లక్షలాది యువకుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో తల్లిదండ్రులు ప్రతి రూపాయి కూడబెట్టి, ఉపాధిహామీ పనులకు వెళ్లి తమ బిడ్డలను అశోక్ నగర్‌లోనో, దిల్‌సుఖ్ నగర్‌లోనో కోచింగ్ సెంటర్లకు పంపితే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదని, ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని, ప్రశ్నాపత్రాల దిద్దడం సరిగా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలతో విసిగిపోయిన నిరుద్యోగ యువత ముందుకు వచ్చి తండ్రి, కొడుకు, అల్లుడు, కుమార్తెల ఉద్యోగాలు ఊడగొట్టడంతోనే తాము అధికారంలోకి వచ్చామని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకు నియామకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
విద్యపై పెట్టే ఖర్చు ఖర్చు కాదని, భవిష్యత్ తరాల నిర్మాణానికి ఉపయోగపడే ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత నియమితులైన ఉపాధ్యాయులు తెలంగాణకు అఖిల భారత స్థాయి అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌లను, డాక్టర్లు, ఇంజినీర్లను తయారు చేసే బాధ్యతను చేపట్టబోతున్నారని, సర్పంచులు మొదలు ప్రధానమంత్రి వరకు తయారు చేసే బాధ్యత వారిపైనే ఉందని అభిప్రాయం తెలిపారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానంటే నాడు ప్రభుత్వ పాఠశాలలో అందించిన విద్యనే కారణమన్నారు. తాను గుంటూరు, గుడివాడలోనో చదువుకోలేదని, గుంటూరులోనో, మరెక్కడో చదువుకున్న కొందరు తనకు ఇంగ్లిష్ రాదని అవహేళన చేస్తున్నారని ఆయన విమర్శించారు. చైనా, జపాన్, జర్మనీలో వారికి ఇంగ్లిష్ రాదని, కానీ ప్రపంచంతోనే పోటీపడే అభివృద్ధి, ఉత్పత్తులను ఆయా దేశాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఇంగ్లిష్ అనేది ఓ భాష, ప్రపంచంలో ఉద్యోగం, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని, తమ రోజుల్లో నాడు ఉన్న అవకాశాలతో అక్కడ నేర్పిన చదువులు నేర్చుకున్నామని తెలిపారు.
నేడు ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే ఇంగ్లిషును ఉపాధ్యాయులు నేర్పాలని, మీ దగ్గర చదువుకునే పిల్లలకు ఇంగ్లిష్ రాదని అవహేళన చేసే పరిస్థితి రావద్దని ఆయన సూచించారు. పిల్లలకు మంచి భాషను, భావాన్ని దేశభక్తిని నేర్పాలని, వారే రేపటి పాలకులు అవుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చామని గత పాలకులు చెబుతున్నారని, వాటిలో ఎక్కడైనా మౌలిక వసతులు కల్పించారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే మోడల్ గురుకుల పాఠశాల తీసుకురావాలని కొడంగల్ నియోజకవర్గంలో రూ.25 ఎకరాల్లో రూ.150 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామని, 119 శాసనసభ నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న చోట ఈ నమూనా క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. పేద విద్యార్థులందరికి విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ప్రతి కిలోమీటర్‌కు సింగిల్ టీచర్ పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి అయిదు కిలోమీటర్లకు ప్రాథమికొన్నత పాఠశాల, ప్రతి పది కిలోమీటర్లకు ఒక హైస్కూల్, ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజినీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలనే విద్యా విధానం ప్రకారం 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గత పదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ మాత్రమే వేసిందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు డీఎస్సీలు వేసి లక్ష ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి పేద పిల్లలకు విద్యను అందించిందని ముఖ్యమంత్రి అన్నారు.
గత ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 6 వేల పాఠశాలలను మూసివేసి దళితులు, గిరిజనులు, వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసి బర్రెలు కాసుకునే వారు బర్రెలు కాసుకోవాలె, గొర్రెలు పెంచుకునే వారు గొర్రెలు కాసుకోవాలె, చేపలు పట్టుకునే వారు చేపలు పట్టుకోవాలె అనే పథకాలు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మన తాతలు, తండ్రులు గొర్రెలు కాస్తే, బర్రెలు కాస్తే, చెప్పులు కుడితే మన పిల్లలు అవే పనులు చేయాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో వారు భాగస్వాములు కావద్దా..? వారు గొర్రెలు, బర్రెలు కాసుకోవాలా అని నిలదీశారు. గత ముఖ్యమంత్రి మనవడు పెంచుకున్న కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్‌పై కేసు పెట్టి లోపల వేశారని, మరి ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని (నాటి పాలకులను) ఉరి వేయాలా వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారి పెంపుడు కుక్కకున్న విలువ పేదల ప్రాణాలకు లేదా అన్నారు. ప్యూడల్ విధానం మారాలి... పేదవాడికి విద్య చేరాలి.. విద్య ఒక్కటే మన జీవితాల్లో వెలుగు నింపుతుందని, చదువుతోనే మనం ఏ స్థాయికైనా ఎదగవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంతన్న అంటే వెంటనే పలుకుతున్నానని, ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానని, ఇది తన తాతలు ఇచ్చిన ఆస్తి కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో మంత్రులు ఒక్కనాడైనా కలిసేవారా..? ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూశారా..? కలిశారా అని ఆయన ప్రశ్నించారు.
లక్షలాది మందికి విశ్వాసం కల్పించేందుకే....
ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను తీసుకోవడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఎటువంటి పొరపాట్లు లేకుండా అందేందుకు అధికారులు అహర్నిశలు కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమం నిరుద్యోగ యవతకు స్ఫూర్తి కావాలని, ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసా ఇవ్వాలని, తమ ప్రభుత్వం వచ్చింది.. తమకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం నిరుద్యోగులకు కల్పించడానికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామన్నారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, మెగా డీఎస్సీ ద్వారా 11,604 ఉపాధ్యాయ భర్తీలు చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆలోచన చేయండి.. ఆశీర్వదించండి..
ప్రతిపక్షాలు రెచ్చగొడుతాయని అంతా ఆలోచన చేయాలని, ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందా లేదా..? ఈ ప్రభుత్వం పేదల ఆలోచనలు పంచుకుంటుందా..? లేదా.? ప్రజలను కలుస్తుందా ? లేదా..? ప్రజల వద్దకే పరిపాలను తెచ్చామా ? లేదా..? గడీల్లో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాల్లోకి తెచ్చామా..? లేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మూడు నెలలను పరిపాలనను అంచనా చేసి భవిష్యత్‌లో తీర్పు ఇవ్వాలని, రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా, తమ పరిపాలన మీద, తమ నిర్ణయాల మీద, తాము చేస్తున్న నియామకాల మీదనే తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు. అంతా ఆలోచన చేయాలని, ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్లి చర్చించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం, తన మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలనే ఆలోచనతో పని చేస్తున్నారని, ఇంకా చేయాలనే తపన తమకు ఉందని, అందరి ప్రోత్సాహం, పెద్దల ఆశీర్వాదం, యువ మిత్రుల సహకారం తమకు ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాబోయే 35 ఏళ్లలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, ఒక మంచి సంపదను సృష్టించాలని కోరారు. ఇవాళ యువత చాలాచోట్ల డ్రగ్స్, గంజాయి, వ్యసనాల వైపు పోతోందని, విలువలతో కూడిన జీవితాన్ని ఎలా సాగించాలో విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను ఉపాధ్యాయులే నేర్పాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రగ్స్ అనే మాట వినపడవద్దని, తెలంగాణ తులసీవనంలో గంజాయి మొక్కలు ఉండవద్దని వాటిని కూకటి వేళ్లతో పీకివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. వ్యసనాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై పిల్లలకు ఉపాధ్యాయులు నేర్పించాలని ముఖ్యమంత్రి అన్నారు. 6,546 ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలనుకున్నామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో కొన్ని నియామక పత్రాలు ఆగాయని, ఈ రోజు 5,192 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మిగతా వారికి కోడ్ పూర్తికాగానే వారి ఇళ్లకు నియామక పత్రాలు పంపుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో అందరి సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి