CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Jul 16 , 2024 | 03:01 PM
తెలంగాణలో ఆరోగ్యశ్రీపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రేషన్ కార్డుతో లింకులు.. ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకింత తీపి కబురే చెప్పారు...
హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్యశ్రీపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రేషన్ కార్డుతో లింకులు.. ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకింత తీపి కబురే చెప్పారు. మంగళవారం నాడు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన రేవంత్.. ఆరోగ్య శ్రీపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని సూచించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్న అధికారులను సీఎం ఆదేశించారు.
చర్యలు తీసుకోండి..!
‘రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలి. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలి. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలి’ అని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.