Share News

Hyderabad News: మెట్రోకు అన్యూహ్య రద్దీ.. అసలేం జరిగిందంటే?

ABN , Publish Date - Aug 20 , 2024 | 01:05 PM

మంగళవారం తెల్లవారు జామున కురిసిన అతి భారీ వర్షానికి హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయం కావడం.. మంగళవారం వర్కింగ్ డే కావడంతో ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కాలేజీలు వెళ్లే యువతలో అత్యధికులు ‘మెట్రో’ ప్రయాణానికి మొగ్గుచూపారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లు అన్ని భారీ రద్దీతో కనిపిస్తున్నాయి. రైళ్లన్నీ ప్రయాణీలకులతో కిక్కిరిసిపోయాయి.

Hyderabad News: మెట్రోకు అన్యూహ్య రద్దీ.. అసలేం జరిగిందంటే?

మంగళవారం తెల్లవారు జామున కురిసిన అతి భారీ వర్షానికి హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. అనూహ్య రీతిలో తక్కువ సమయంలో భారీ వర్షపాతం నమోదవడంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా రహదారులు చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లోని రోడ్లైతే వాగులు, వంకలను తలపించాయి. వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ముందుకు కదలాల్సిన పరిస్థితులు కనిపించాయి. పలు ప్రాంతాల్లోని రోడ్లుపై వాహనాలు ముందుకు కదలడం కష్టంగా కనిపించింది. దీంతో మంగళవారం వర్కింగ్ డే కావడంతో ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కాలేజీలు వెళ్లే యువతలో అత్యధికులు ‘మెట్రో’ ప్రయాణానికి మొగ్గుచూపారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లు అన్ని భారీ రద్దీతో కనిపిస్తున్నాయి. రైళ్లన్నీ ప్రయాణీలకులతో కిక్కిరిసిపోయాయి.


రోజువారీ ప్రయాణీకుల రద్దీతో పోల్చితే ప్రయాణీల సంఖ్య బాగా పెరిగినట్టు స్పష్టంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కిక్కిరిసిన జనాల మధ్య ప్రయాణం ఇబ్బందికరంగా అనిపించినా సకాలంలో చేరుకునేందుకు ప్యాసింజర్లు మెట్రో ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాలు తీసి పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోయినప్పటికీ ఏదో ఒకలా కాసేపు ఇబ్బందిపడితే చాలు గమ్య స్థానానికి చేరుకుంటామనే ఉద్దేశంతో ఓపికగా మెట్రోలో ప్రయాణిస్తున్నారు.


కాగా సోమవారం మధ్యాహ్నమే హైదరాబాద్ నగరంలో వర్షం మొదలైంది. భారీగా మొదలైన వాన రాత్రంతా పడుతూనే ఉంది. దీంతో సోమవారం నుంచే మెట్రోకు రద్దీ పెరిగింది. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అనేక మంది మెట్రోలోనే ప్రయాణించారు. ఇక సోమవారం రాత్రి మొదలుకొని.. మంగళవారం తెల్లవారు జాము వరకు వర్షం పడడంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీంతో నగర వాసులు మెట్రోకు పోటెత్తారు.


ఇదిలావుంచితే.. ఈ రోజు కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఫిలింనగర్, షేక్‌పేట్, మెహిదీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.


ఎల్‌బీ నగర్, హయత్‌నగర్, సికింద్రాబాద్, రసూల్‌పురా, బోయిన్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, చింతల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, సనత్ నగర్, కూకట్‌పల్లి, మూసాపేట్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి , రాంనగర్, అశోక్ నగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, మల్కాజిగిరిలోనూ వాన పడింది. భారీ వర్షం నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది.

Updated Date - Aug 20 , 2024 | 01:18 PM