Hyderabad: ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌కు మరో షాక్..
ABN , Publish Date - Dec 28 , 2024 | 08:46 AM
తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 7 జనవరి, 2025న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది.
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసు (Formula-E Car Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR)కు ఈడీ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది. 7 జనవరి, 2025న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (Arvind Kumar), హెచ్ఎమ్ డీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy)కి సైతం ఈడీ నోటీసులు అందచేసింది. వారిద్దరినీ జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని చెప్పింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద వారిని ఈడీ విచారణ చేయనుంది. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో వీరంతా పెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఎఫ్ఈవోకు నగదు బదిలీతోపాటు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించింది.
ఏసీబీ కౌంటర్ అఫిడవిట్..
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కౌంటర్ అఫిడవిట్‌ను నిన్న(గురువారం) హైకోర్టు ముందుంచింది. ఈ సందర్భంగా మంత్రి హోదాలో కేటీఆర్ చేసిన తప్పులు, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, ఆర్థిక శాఖను బేఖాతర్ చేసిన వైనాన్ని హైకోర్టు ముందుంచింది. విదేశీ కరెన్సీ సహా అనేక ఉల్లంఘనలకు కేటీఆర్ పాల్పడ్డారని తెలిపింది. సచివాలయ బిజినెస్ రూల్స్ 9, 11 ప్రకారం నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువగా ఏ శాఖ అయినా ఖర్చు చేయాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని తెలిపింది.
మంత్రివర్గం అనుమతి తర్వాతే ఆర్థిక శాఖ సైతం నిధులను విడుదల చేయాలని ఏసీబీ వెల్లడించింది. ఈ నిబంధనలన్నీ కేటీఆర్ తుంగలో తొక్కారని హైకోర్టుకు ఏసీబీ వివరించింది. విచారణ అనంతరం కేటీఆర్‌ను డిసెంబర్ 31 వరకూ అరెస్టు చేయెుద్దని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసు విషయమై హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ డిసెంబర్ 31 లోపు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తే నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని ఏసీబీ అరెస్టు చేసే అవకాశం ఉంటుంది.