Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 02:07 PM
హైదరాబాద్‌లోని నాగోల్‌లో పలు హోటళ్లు, ,రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్లీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన ఆహార పదార్థాల వినియోగాన్ని అధికారులు గుర్తించారు.
హైదరాబాద్, నవంబర్ 13: నగరంలో దాదాపుగా ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితమే. దీంతో చాలా మందికి ఇంట్లో వండుకు తినే తిరికా.. సమయం ఉండడం లేదు. ఆ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లకు జనం భారీగా క్యూ కడుతున్నారు. ఇక వారాంతంలో.. అంటే శనివారం, ఆదివారం అయితే నగరంలోని దాదాపు అన్ని రెస్టారెంట్లు కస్టమర్లలతో కిటకిటలాడి పోతుంటాయి. దీంతో వారిని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రెస్టారెంట్లలో భారీగా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు.
ఒక్కొక్కసారి ఆయా పదార్ధాలు మిగిలిపోతున్నాయి. వాటిని నిల్వ ఉంచి.. మరునాడు కస్టమర్లకు హోటల్, రెస్టారెంట్ల సిబ్బంది వినియోగిస్తున్నారు. వాటిని తిన్న వినియోగదారులు.. తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ముమ్మర తనిఖులు నిర్వహిస్తున్నారు.
అందులోభాగంగా బుధవారం నాగోల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. స్థానిక సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరసా రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని వారు గుర్తించారు. అలాగే నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గమనించారు.
అదే విధంగా కాలం చెల్లిన బ్రెడ్, మిల్క్ ప్యాకెట్లు, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాస్‌లను సైతం ఆహార పదార్ధాల తయారీలో వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు వంట గది అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా.. బొద్దింకలు సైతం తిరుగుతున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది.
అదే విధంగా దసరా రెస్టారెంట్‌లో అయితే కుళ్ళిపోయిన మటన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే హోటల్, రెస్టారెంట్ యజమానులకు నోటీసులు సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేశారు.
For Telangana News And Telugu News