Harish Rao: ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌పై హరీష్‌రావు ఫైర్
ABN , Publish Date - Dec 26 , 2024 | 09:46 AM
Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న వార్తలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. సెలవు రోజుల్లో కావాలని బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 26: ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే వెస్ట్‌మారెడ్‌పల్లిలోని ఎర్రోళ్ల నివాసానికి పోలీసులు వెళ్లారు. ఏ క్షణమైనా ఎర్రోళ్లను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేస్తారన్న వార్తపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందిస్తూ.. ఎర్రోళ్ళ శ్రీనివాస్ అరెస్ట్ అక్రమమని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ ఫైర్ అయ్యారు. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అంటూ విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. సెలవు రోజుల్లో కావాలని బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారన్నారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి.. మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు మేము కాదని గుర్తుంచుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది’’ అంటూ మాజీ మంత్రి హరీష్‌రావు హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
సంచలనం సృష్టిస్తున్న పోలీసుల ఆత్మహత్య.. వివరాలు ఇవే..
ఎర్రోళ్ల ఇంటికి పోలీసులు...
కాగా.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా విచారణకు రావాల్సిందిగా ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 27న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులతో ఎర్రోళ్ల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై పోలీసులు కేస్ ఫైల్ చేశారు. ఈ క్రమంలో ఎర్రోళ్లకు నోటీసులు ఇచ్చేందుకు ఈరోజు (గురువారం) ఉదయం మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఏ క్షణమైనా ఎర్రోళ్లను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వచ్చినప్పటికీ ఎర్రోళ్ల మాత్రం ఇంట్లో నుంచి బయటకు రాలేదు. మరోవైపు విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి చేరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News