Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం స్పెషల్ పీపీని నియమించనున్న ప్రభుత్వం

ABN , Publish Date - Apr 10 , 2024 | 10:54 AM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ పీపీనుప ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులు అరెస్టు అయిన విషయం తెలిసిందే.

 Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం స్పెషల్ పీపీని నియమించనున్న ప్రభుత్వం

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణ కోసం స్పెషల్ పీపీ (Special PP)ను ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు (Radha Kishan Rao), మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు (Bhujangarao), తిరుపతన్న (Tirupatanna), మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (Praneet Rao)లు అరెస్టు అయిన విషయం తెలిసిందే. కోర్టులో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నెలరోజులు గడుస్తున్న ఈ కేసులో లభించింది కొన్ని ఆధారాలు మాత్రమే. హై ప్రొఫైల్ కేసు కావడంతో కేవలం ఈ కేసు కోసమై ప్రత్యేక పీపీని ప్రభుత్వం నియమించనుంది.

కాగా ఇంతకాలం పోలీసు అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఎస్డీ) రాధాకిషన్‌రావు విచారణతో కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్ఐబీ) చీఫ్‌ ప్రభాకర్‌రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్‌రావును ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారంతో రాధాకిషన్‌ కస్టడీ ముగియనుంది. మొదటి రెండ్రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీస్‌, ఎస్‌ఐబీలో ప్రత్యేక టీంలలో ఎవరెవరు పనిచేసేవారు? ఫోన్‌ట్యాపింగ్‌ జట్టు ఎవరితో కలిసి పనిచేసేది? ఎస్‌ఐబీలో ఉన్న సిబ్బంది/అధికారుల పాత్ర ఏమిటి? టాస్క్‌ఫోర్స్‌ రోల్‌ ఏంటి? అనే అంశాలతోపాటు.. బెదిరింపులు, నగదు తరలింపు, బెదిరింపు వసూళ్లపైనా దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. మూడో రోజు నుంచి తెరవెనక ఉండి ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారాన్ని నడిపించిన గత ప్రభుత్వ పెద్దలెవరు? వారి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలను సంధించినట్లు సమాచారం. కేసులో రాధాకిషన్‌రావు వాంగ్మూలం అత్యంత కీలకం కావడంతో.. తొలిరోజు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే దర్యాప్తు అధికారులు న్యాయనిపుణుల సలహాలను తీసుకున్నారు. కోర్టులో కేసు ఎక్కడా వీగిపోకుండా ఉండేలా బలమైన ఆధారాలను సేకరించేందుకు.. 200 ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కోణానికి సంబంధించిన ప్రశ్నలను సంధించి, సమాధానాలను రాబట్టుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల్లో.. 10 మందికి పైగా నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు రాధాకిషన్‌ వెల్లడించారని తెలుస్తోంది. ఓ దశలో రాధాకిషన్‌రావు నోరు మెదపకపోవడం.. సమాధానాలను దాటవేసే యత్నం చేయడంతో.. అధికారులు తమదైన శైలిలో విచారించినట్లు సమాచారం. దాంతో.. తాను 2017లో కీలకమైన టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పోస్టింగ్‌ పొందడం దగ్గరి నుంచి.. 2020 ఆగస్టులో రిటైరైనా.. కొనసాగడం.. గతేడాది ఆగస్టులో 3సార్లు పొడిగింపులు పూర్తయినా.. మరో మూడేళ్ల పాటు టర్మ్‌ను పెంచడం వెనక గత ప్రభుత్వ హయాంలో ఎవరు సహకరించింది చెప్పినట్లు తెలుస్తోంది.ప్రతిగా తాను వారికి ఎలా సహకరించింది వివరించినట్లు సమాచారం.

ముందస్తు బెయిల్‌ యోచనలో ప్రభాకర్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు పోలీస్‌ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఓ సీనియర్‌ అధికారితో ఫోన్‌లో మాట్లాడిన ప్రభాకర్‌రావు పోలీస్‌ నుంచి తనకు ఎలాంటి సహాయం అందే పరిస్థితి లేదని అర్థం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన అధికారులంతా నెపాన్ని ప్రభాకర్‌రావుపైనే వేయడంతో ఈ కేసులో ఆయనే కీలకంగా మారారు. దీంతో.. ప్రస్తుతం క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు.. వయోభారం, అనారోగ్యం వంటి కారణాలను చూపించి, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా ఉన్న మార్గాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. అందులో భాగంగానే హైదరాబాద్‌లో తన పరిచయస్తులైన న్యాయవాదులతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ప్రభాకర్‌ రావును విచారించడం వల్ల చిక్కుముడులన్నీ వీడే అవకాశం ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు అధికారులు ముందుకు సాగుతున్నారు.

వచ్చేవారం కీలక మలుపులు!

రాధాకిషన్‌రావు విచారణ సందర్భంగా పది మందికి పైగా రాజకీయ నాయకుల పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు.. వచ్చేవారం వారిపై ఫోకస్‌ చేసే అవకాశాలున్నాయి. బుధవారంతో రాధాకిషన్‌రావు కస్టడీ ముగియనుంది. అరెస్టయిన పోలీసుల విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో.. వీరందరి విచారణల సారాంశానికి సంబంధించి పేపర్‌వర్క్‌ పూర్తయ్యాక.. రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ చేసి, వారిని ప్రశ్నించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. వచ్చేవారం ఈ కేసు కీలక మలుపులు తిరిగే అవకాశాలున్నాయి.

Updated Date - Apr 10 , 2024 | 10:54 AM