Hyderabad Rains: హైదరాబాద్‌కు హై అలర్ట్.. దయచేసి బయటికి రావొద్దు!
ABN , Publish Date - Aug 16 , 2024 | 06:25 PM
రుతుపవనాలు(Monsoon Season) ప్రభావంతో భాగ్యనగరంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరం పశ్చిమం వైపున ఉన్న గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అల్విన్, చందానగర్, పటాన్ చెరు, అమీన్‌పూర్, ఇస్నాపూర్, బీరంగూడ, బీహెచ్ఈఎల్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్: భాగ్యనగరానికి భారత వాతావరణ శాఖ(IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేతప్పా బయటకి రావద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇవాళ(ఆగస్టు 16) కూడా హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి.
ముఖ్య గమనిక..
కూకట్‌పల్లి, మూసాపేట్, కేపీహెచ్‌బీ, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్‌లో(Hyderabad Rains) భారీ వర్షం కురుస్తోందని, పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, అమీర్‌పేట, వెంగళరావు నగర్, యూసఫ్‌గూడ, ఐడీఏ బొల్లారం, గుమ్మడిదలలో అతి భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. రానున్న రెండు మూడు రోజులపాటు నగరవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచిస్తున్నారు. నగరం పశ్చిమం వైపున ఉన్న గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అల్విన్, చందానగర్, పటాన్ చెరు, అమీన్‌పూర్, ఇస్నాపూర్, బీరంగూడ, బీహెచ్ఈఎల్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో గురువారం కూడా వర్షాలు దంచికొట్టాయి.
చాదర్ ఘట్ మార్గంలో ట్రాఫిక్ జామ్..
వానలతో చాదర్ ఘాట్, మలక్ పేటలలో వరద నీరు నిలిచింది. చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట, దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ కారిడర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ స్తంభించిందని పోలీసులు తెలిపారు. రాత్రి వరకు నిరంతరాయంగా వర్షం కురుస్తుందని.. నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
రంగంలోకి సహాయక బృందాలు..
భాగ్యనగరానికి రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పరిస్థితులను నిరంతరం మానిటర్ చేసేందుకు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరించారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అయితే నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.