Telangana: అమ్మాయిలను చెప్పుతో కొట్టించిన వార్డెన్.. చాదర్ ఘాట్‌లో ఉద్రిక్తత
ABN , Publish Date - Dec 09 , 2024 | 10:18 PM
హాస్టల్ విద్యార్థుల మధ్య స్వల్ప వివాద నేపథ్యంలో తల్లిదండ్రులను పిలిపించి ఇతర విద్యార్థినులపై దాడి చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక తల్లిదండ్రులతో పలువురు హాస్టల్ విద్యార్థినులను వార్డెన్ చెప్పుతో కొట్టించారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. తోటి విద్యార్థినులను..
అమ్మాయిలకు రక్షణగా నిలవాల్సిన హాస్టల్ వార్డెన్ స్వయంగా తన వసతిగృహంలో విద్యార్థినులను చెప్పుతోత కొట్టించిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్‌లో చోటుచేసుకుంది. హాస్టల్ విద్యార్థుల మధ్య స్వల్ప వివాద నేపథ్యంలో తల్లిదండ్రులను పిలిపించి ఇతర విద్యార్థినులపై దాడి చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక తల్లిదండ్రులతో పలువురు హాస్టల్ విద్యార్థినులను వార్డెన్ చెప్పుతో కొట్టించారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. తోటి విద్యార్థినులను చెప్పుతో కొడుతున్న సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన బాలికలపై వార్డెన్ చేయి చేసుకున్నారని హాస్టల్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కొందరు బాలికలు బయటకు వెళ్లేందుకు యత్నించగా.. హాస్టల్ గేటుకు వార్డెన్ తాళం వేయించారు.దీంతో ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ముగ్గురు బాలికలు హస్టల్ భవనం నుంచి మరో భవనంపైకి దూకి తప్పించుకున్నారు. విద్యార్థులు మొత్తం భయాందోళనలో హాస్టల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు నెలల క్రితమే ఫిర్యాదు..
హాస్టల్ వార్డెన్ శాంతి అక్రమాలపై అధికారులకు మూడు నెలల క్రితమే విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్‌లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు మొత్తం 150 మంది ఉన్నారు. ఇటీవల కాలంలో వార్డెన్ వైఖరి సరిగ్గా లేదని విద్యార్థులు చెబుతున్నారు. వార్డెన్ అక్రమాలపై ఫిర్యాదు చేయడంతోనే తమపై దాడి చేయించారని హాస్టల్ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.
హాస్టల్ వద్ద ఉద్రిక్తత..
వార్డెన్ వైఖరిని నిరసిస్తూ చాదర్ ఘాట్‌లోని ఎస్సీ బాలికల వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో హాస్టల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. తక్షణమే వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here