Share News

Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ క్రైమ్.. క్రిప్టో కరెన్సీ ద్వారా రూ.175 కోట్లు విదేశాలకు

ABN , Publish Date - Aug 25 , 2024 | 07:38 PM

భాగ్యనగరంలో(Hyderabad) సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు విభిన్న పంథా ఎంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు.

Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ క్రైమ్.. క్రిప్టో కరెన్సీ ద్వారా రూ.175 కోట్లు విదేశాలకు

హైదరాబాద్: భాగ్యనగరంలో(Hyderabad) సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు విభిన్న పంథా ఎంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా రూ.175 కోట్ల సైబర్ క్రైం గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇందులో పాల్గొన్న ఇద్దరు ఆటో డ్రైవర్లు మహమ్మద్ షూబ్ తౌకీర్, మహమూద్ బిన్ అహ్మద్ బవాజీర్‌ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇరువురి నుంచి రూ.175 కోట్ల లావాదేవీలను పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు పాతబస్తీలోని ఎస్బీఐలో 6 బ్యాంక్ అకౌంట్లను వేర్వేరు పేర్లపై తీసుకున్నారు.


ఆయా బ్యాంక్ అకౌంట్లలో లావాదేవీలపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూపీ లాగారు. దీంతో డొంకంతా కదిలింది. తమదైన శైలిలో విచారణ జరిపిన పోలీసులు నకిలీ ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితులు అమాయకుల పేర్లతో అకౌంట్లు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడ్డారని, వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయినట్లు గుర్తించారు. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు తరలించారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.


చైనా హస్తం..

600 కంపెనీలకు అకౌంట్లను లింక్ చేసిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌ నుంచి దుబాయి, ఇండోనేసియా, కంబోడియాలకు డబ్బులు బదిలీ చేశారని, క్రిప్టో కరెన్సీ ద్వారా ఇది జరిగిందని దర్యాప్తులో తేలింది. సైబర్ నేరగాళ్లు ఇవ్వజూపిన డబ్బులకు ఆశపడి ఆటోడ్రైవర్లు ఈ పనులకు అంగీకరించారు. అయితే సైబర్ నేరస్థుల వెనక చైనా సైబరాసురుల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 25 , 2024 | 07:38 PM