Hyderabad: బంగాళదుంప, సున్నంతో మెడిసిన్.. ఎక్కడ తయారు చేస్తున్నారంటే..!
ABN , Publish Date - Jan 23 , 2024 | 05:34 PM
Fake Medicine in Hyderabad: జనాలు చిన్న జలుబు చేసినా ముందులు వాడుతుంటారు. జ్వరమొచ్చినా.. తలనొప్పి వచ్చినా.. కీళ్ల నొప్పులైనా మందులు వేసుకుంటుంటారు. మరి ఆరోగ్య సమస్య నుంచి సాంత్వన పొందేందుకు మీరు వేసుకునే మెడిసిన్స్ నిజమైనవి కాకపోతే.. పైకి బ్రాండెడ్ మెడిసిన్స్ లుక్‌లో ఉన్నా అవి నకిలీ మందులైతే.. వాటి వినియోగం ద్వారా వ్యాధి తీవ్రమైతే పరిస్థితి ఏంటి? ఏముంది వ్యక్తి ప్రాణం గాల్లో కలవాల్సిందే.
హైదరాబాద్, జనవరి 23: జనాలు చిన్న జలుబు చేసినా ముందులు వాడుతుంటారు. జ్వరమొచ్చినా.. తలనొప్పి వచ్చినా.. కీళ్ల నొప్పులైనా మందులు వేసుకుంటుంటారు. కొందరు వైద్యులకు చూయించుకుని, వారి సలహాల మేరకు మందులు వాడితే.. మరికొందరు తెలిసిన మెడిసిన్స్ వాడుతుంటారు. మొత్తంగా వ్యాధి నయం అవ్వాలంటే మందులు వాడాల్సిందే. మరి ఆరోగ్య సమస్య నుంచి సాంత్వన పొందేందుకు మీరు వేసుకునే మెడిసిన్స్ నిజమైనవి కాకపోతే.. పైకి బ్రాండెడ్ మెడిసిన్స్ లుక్‌లో ఉన్నా అవి నకిలీ మందులైతే.. వాటి వినియోగం ద్వారా వ్యాధి తీవ్రమైతే పరిస్థితి ఏంటి? ఏముంది వ్యక్తి ప్రాణం గాల్లో కలవాల్సిందే. ఇలా నిండు ప్రాణం గాల్లో కలవడానికి కారణం నకిలీ మందుల తయారీ ముఠానే. అవును, ఎవరికేమైతే మాకేంటిలే అనుకుంటూ.. డబ్బు సంపాదనే పరమావధిగా తెగబడిపోతున్నారు నకిలీ మందుల తయారీ ముఠా. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నకిలీ మందుల తయారీ ముఠాల ఆగడాలు నానాటికి ఎక్కువైపోతున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని.. వారి ఆరోగ్యాలను పణంగా పెట్టి నకిలీ మందులు తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. ఎవరికేమైతే మాకింటిలే అంటూ యధేచ్ఛగా నకిలీ మెడిసిన్స్ తయారీ చేసి, వాటిని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీరి ఆగడాలపై ఏకంగా ఇంటర్‌పోల్ ఫోకస్ పెట్టిందంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, ఈ ఫేక్ గ్యాంగ్‌పై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నకిలీ మందుల తయారీపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస దాడులతో కేటుగాళ్లకు చెక్ పెడుతున్నారు పోలీసులు. తాజాగా రాష్ట్రంలో నకిలీ డ్రగ్ తయారీ ముఠాలను అరెస్ట్ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ బోర్డ్ డీజీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ముఠా ఆగడాలకు కళ్లెం వేశామని అన్నారు. ఇదే విషయమై డీజీ కమలాసన్ రెడ్డి మంగళవారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
తెలంగాణాలో నకిలీ మందులు తయారీపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు. గత 6 నెలల నుంచి నకిలీ మందుల విక్రయాలపై నిఘా పెంచామని, నకిలీ డ్రగ్ తయారీ ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. నకిలీ మెడిసిన్ అమ్మకాలు పై ఇంటర్ పోల్ సైతం ఆరా తీసిందన్నారు డీజీ. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ముఠా ఆగడాలకు కళ్లెం వేశామని చెప్పారు. ప్రముఖ కంపెనీల పేరుతో భారీగా నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మొక్కజొన్న పిండి, బంగాళదుంప, సుద్దతో నకిలీ మందులు తయారు చేసి బ్రాండెడ్ మెడిసిన్‌గా అమ్మకాలు జరుపుతున్నట్లు తమ తనిఖీల్లో తేలిందన్నారు డీజీ. నకిలీ డ్రగ్ రాకెట్లు పై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పిన ఆయన.. తెలంగాణా రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ లేకుండా చేస్తామని ప్రకటించారు.
మెడికల్ షాపులకు కీలక ఆదేశాలు..
ఇదే సమయంలో మెడికల్ షాపులకు కీలక ఆదేశాలు జారీ చేశారు డీజీ కమలాసన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం విధించిన రేట్లకు మాత్రమే మెడికల్ షాపులు మందులు విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడటం డ్రగ్ కంట్రోల్ బోర్డ్‌గా తమ బాధ్యత అని చెప్పారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు డీసీఏ డీజీ. గత 6 నెలల నుండి నకిలీ మందులపై నిఘా పెంచామని, గడిచిన 6 నెలల్లో చాలా నకిలీ మెడిసిన్, ఇంజక్షన్స్ సీజ్ చేసామని వెల్లడించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ మందులను తయారు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో నకిలీ మందులు తయారు చేసి హైదరాబాద్‌లో సెల్ చేస్తున్నారని తెలిపారు డీజీ. ఇతర రాష్ట్రాల నుండి కొరియర్, ఎజెoట్ల ద్వారా హైదరాబాద్‌కు దిగుమతి చేస్తున్నట్లు చెప్పారు.
అలా చేస్తే చర్యలు తప్పవు..
రాష్ట్రంలో 42 వేల మందులు షాప్ లు ఉన్నాయని, నకిలీ మందులను తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని చెప్పారు డీజీ కమలాసన్ రెడ్డి. నకిలీ మందులు దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ షాపు యాజమాన్యాలను హెచ్చరించారు డీజీ. అలాగే నకిలీ మందులు తయారు చేసే కంపెనీలపైనా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు మెడికల్ షాపులపై ఫోకస్ పెట్టామన్నారు. గత 6 నెలలుగా చేపడుతున్న తనిఖీల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్ ద్వారా నకిలీ మందులు పంపిస్తున్నారని, అలాంటి ముఠాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పారు డీజీ కమలాసన్ రెడ్డి. మార్కెట్‌లో వచ్చే నకిలీ మందులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డ్రగ్ కంట్రోల్‌కి వెబ్‌సైట్ ఉందని, టోల్ ఫ్రీ నంబర్‌తో పూర్తి సమాచారం అందులో పొందూ పరుస్తున్నామని చెప్పారు డీజీ కమలాసన్ రెడ్డి. ప్రజలు నకిలీ మందులు గుర్తించకుండా ఉండేందుకే భారీగా డిస్కౌంట్స్ ఇస్తున్నారని అన్నారు డీజీ.