Traffic Diversion: రేపటి నుంచి ఈ రూట్‌లో వెళ్తున్నారా.. కొత్త చిక్కులు కొన్ని తెచ్చుకున్నట్లే
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:00 PM
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తెగ ఇబ్బంది పెడుతోంది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులుల తలెత్తకుండా..
వినాయక చవితి వచ్చేసింది.. హైదరాబాద్‌లో బడా గణేశుడు కొలువుదీరాడు. తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేల సంఖ్యలో వినాయక మండపాలు వెలిశాయి. ప్రధాన వీధుల్లో తప్పకుండా ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తెగ ఇబ్బంది పెడుతోంది. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులుల తలెత్తకుండా పోలీసులు ప్రత్యుక చర్యలు తీసుకుంటున్నారు. పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. సెప్టెంబర్7వ తేదీ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే 17వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఈపది రోజులు ఉదయం 11 గంటల వరకు అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అందుబాటులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
ఖైరతాబాద్ విశ్వేశ్వరాయ విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనమతించరు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నిరంకారి జంక్షన్ వైపు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సైఫాబాద్ పాత పోలీస్ నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ వైపు రాజ్ దూత్ లేన్‌లోకి సాధారణ ట్రాపిక్‌ను అనుమతించరని, ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను అనుమతించరు.
సాధారణ వాహనాలను ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ లేన్ వైపు అనుమతించరు. మింట్ కాంపౌండ్ లేన్ ఎంట్రన్స్ నుంచి వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
ఎన్టీఆర్ మార్గ్/ఖైరతాబాద్ ఫ్లైఓవర్/ నెక్టెస్ రోడ్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. నెక్టెస్ రోడ్‌లో రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్ వైపు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
నిరంకారి నుంచి సాధారణ ట్రాఫిక్‌ను ఖైరతాబాద్ పోస్టాఫీసు లేన్, ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు అనుమతించరు. పోస్టాఫీసు వద్ద ఓల్డ్ సైఫాబాద్ జంక్షన్ వైపు కూడా వాహనాలను అనుమతించరు.
సెలవు రోజుల్లో..
సాధారణ, వారాంతపు సెలవు రోజుల్లో ఖైరతాబాద్ బడా గేణేశుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, మింట్ కాంపౌండ్ ప్రాంతాలు రద్దీగా ఉంటాయని, సెలవు దినాల్లో ఈ మార్గాల్లోకి వావాహనదారులు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
పార్కింగ్ స్థలాలు ఇవే..
నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలంలో, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ప్లేస్‌తో పాటు సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు.
భక్తులు తమ వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే సరిగ్గా పార్క్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆలస్యాలను నివారించడానికి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని తెలిపారు. ప్రయాణ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626కు కాల్ చేయాల్సిందిగా తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News Click Here