Share News

తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టారేం!?

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:52 AM

ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే దాదాపు 71 కిలోమీటర్ల వరకూ గ్రావిటీతో వచ్చే నీళ్లను కాదని కాళేశ్వరం ఎత్తిపోతలను ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ కమిషన్‌ దృష్టి సారించింది.

తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టారేం!?

  • కాళేశ్వరం నిర్మాణానికి

  • ప్రామాణిక నివేదిక ఏమిటి!?

  • దృష్టిసారించిన జస్టిస్‌ పినాకీ

  • చంద్ర ఘోష్‌ కమిషన్‌

  • కేసీఆర్‌కు నివేదిక ఇచ్చిన

  • విశ్రాంత ఇంజనీర్లతో నేడు భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే దాదాపు 71 కిలోమీటర్ల వరకూ గ్రావిటీతో వచ్చే నీళ్లను కాదని కాళేశ్వరం ఎత్తిపోతలను ఎందుకు చేపట్టారనే అంశంపై జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ కమిషన్‌ దృష్టి సారించింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఉంటే ఎల్లంపల్లి వరకూ గ్రావిటీతో నీళ్లు వచ్చేవని, తద్వారా ఎత్తిపోతలకు అయ్యే కరెంట్‌ బిల్లు ఖర్చు కూడా తగ్గేదని, అటువంటి పరిస్థితుల్లో దానిని ఎందుకు పక్కనబెట్టారని ఆరా తీస్తోంది. ఇవే అంశాలను ప్రస్తావించడమే కాకుండా తుమ్మిడిహెట్టి వద్దే బ్యారేజీ కట్టాలని, మేడిగడ్డ బ్యారేజీతో ప్రయోజనం లేదని 2015లోనే ఐదుగురు విశ్రాంత ఇంజనీర్లు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు.

వారు అప్పట్లో ఇచ్చిన నివేదికపై కమిషన్‌ ఇప్పుడు దృష్టి సారించింది. ఆయా ఇంజనీర్లతో శనివారం భేటీ కానుంది. సదరు నివేదిక నేపథ్యంలోనే.. తుమ్మిడిహెట్టి కాకుండా 100 కిలోమీటర్ల కిందకు వెళ్లి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కట్టాలని ఎవరు చెప్పారు!? ఏ నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను డిజైన్‌ చేసి కట్టారు? ఇందుకు ప్రామాణికత ఏమిటి!? దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందా? లేక ఏదైనా నివేదికను పరిగణనలోకి తీసుకొని కాళేశ్వరం కట్టారా? తదితర అంశాలపై కమిషన్‌ దృష్టి సారించింది. అలాగే, పనులు పూర్తి కాకపోయినా పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారు? వాటిపై కౌంటర్‌ సంతకాలు ఎవరు చేశారు? ఆర్థిక ఉల్లంఘనలు ఏమేమిటి? అనే అంశాలపైనా దృష్టిపెట్టింది.

అలాగే, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకోవాలని కమిషన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యంతర నివేదిక అందిందని, పూర్తి నివేదికను సత్వరం తెప్పించుకోవాలని సూచించింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి కారణాలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) జూలై 7వ తేదీలోగా నివేదిక సమర్పించే అవకాశాలున్నాయని కమిషన్‌ భావిస్తోంది. ఆ నివేదిక చేతికందాక తదుపరి చర్యలకు ఉపక్రమించనుంది. ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక ఆధారంగానే బ్యారేజీల్లో మరమ్మతులు/పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేస్తున్న విషయం తెలిసిందే.


  • అఫిడవిట్లను సీల్డ్‌ కవర్లోనే అందించాలి

కమిషన్‌కు సమర్పించే అఫిడవిట్లను సీల్డ్‌ కవర్‌లో అందించాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ అధికారులను ఆదేశించారు. ఈఎన్‌సీ (జనరల్‌) పరిధిలో పనిచేసే అధికారులతోపాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ (ఓ అండ్‌ ఎం) అధికారులను శనివారం ఆయన విచారించారు. ఈ సందర్భంగా.. ఆయా అధికారులు నిర్వర్తిస్తున్న బాధ్యతలేమిటి? ఏమేం చేశారు? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరితో సంప్రదింపులు జరపకుండా అఫిడవిట్లు ఉండాలని, అన్నీ ఒకే నమూనాలో ఉన్నా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Jun 15 , 2024 | 07:14 AM