Share News

Mallu Bhatti Vikramarka: జాబ్ క్యాలెండర్‌‌పై కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 19 , 2024 | 09:33 PM

మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు.

Mallu Bhatti Vikramarka: జాబ్ క్యాలెండర్‌‌పై కీలక ప్రకటన
Mallu Bhatti Vikramarka

హైదరాబాద్: మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని, ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని తెలిపారు. గ్రూప్ 2 అభ్యర్థులతో సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క సమావేశమయ్యారు.


అనంతరం మీడియాతో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవని అన్నారు. సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే తమ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారిన.. తెలంగాణ బిడ్డలకు ఎంత త్వరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిదని.. ఎన్నికల్లో హామీ ఇచ్చామని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుందని.. కానీ తాము అలా ఆలోచించడం లేదని తెలిపారు.


విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి..

‘‘మా బిడ్డలు స్థిరపడాలి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వేగంగా అడుగులు వేస్తున్నాం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి.. కేసుల పాలైతే మీరే నష్టపోతారు.. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడొద్దు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తాం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం’’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.


ప్రతి అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తాం

‘‘హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు. ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌లోనే ప్రశ్నలు వేయొచ్చు. అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇకనుంచి అశోక్ నగర్‌లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తాం, మీరు మా బిడ్డలు.. రాష్ట్ర సంపద.. మీ మేథస్సు వృథా కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన. ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు విని పరిష్కరిస్తుంది. గ్రూప్ 2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు’’ అని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 09:49 PM