Telangana: క్షమించు తల్లీ.. కేటీఆర్ సంచలన ట్వీట్..!
ABN , Publish Date - Aug 17 , 2024 | 11:49 AM
తన తండ్రిపై దాడిని తట్టుకోలేక బాలిక కుప్పకూలిపోయిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. బాలిక మృతికి సంతాపం ప్రకటించారు. ‘నిజంగా హృదయవిదారకమే! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి...
హైదరాబాద్, ఆగష్టు 17: తన తండ్రిపై దాడిని తట్టుకోలేక బాలిక కుప్పకూలిపోయిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. బాలిక మృతికి సంతాపం ప్రకటించారు. ‘నిజంగా హృదయవిదారకమే! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి ఆమె తండ్రి సోమయ్యపై దాడి చేయడంతో 14 ఏళ్ల పావని గుండె ఆగిపోయింది. ఆమె సహాయం కోసం విలపించింది. తన తండ్రిపై దాడిని చూసి బాధ తట్టుకోలేక పావని కుప్పకూలి చనిపోయింది. ఓ కూతురికి తండ్రిగా, ఒక చిన్న అమ్మాయిని రక్షించడంలో విఫలమైనందుకు బాధగా ఉంది! ఆ కుటుంబానికి, ముఖ్యంగా తండ్రికి ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వంపై మరో పెద్ద మచ్చ ఇది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి అనేందుకు ఈ హృదయ విదారకర ఘటనే ఉదాహరణ. క్షమించండి పావని మేము నిన్ను రక్షించడంలో విఫలం అయినందుకు.’ అని పోస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో విషాధ ఘటన చోటు చేసుకుంది. సోమయ్యకు భార్య కుమారుడు, కుమార్తె పావని(14) ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన కడారి సైదులు కుటుంబానికి, సోమయ్య కుటుంబానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సోమయ్య ఊరు విడిచి సూర్యాపేటకు వలస వెళ్లాడు. కొంతకాలం అక్కడే పని చేయగా.. ఇటీవలే మళ్లీ స్వగ్రామానికి వచ్చేశారు. అయితే, పాత కక్షలతో రగిలిపోయిన సైదులు.. తన వెంట మరో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి సోమయ్య కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. తన తండ్రిని, తల్లిని దుండగులు కొట్టడాన్ని తట్టుకోలేక పావని కుప్పకూలిపోయింది. నిందితులు అక్కడి నుంచి పారిపోగా.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.